Vijayawada to Delhi: విజయవాడ టూ ఢిల్లీ.. సెప్టెంబర్ 14నుంచి కొత్త ఫ్లైట్ సర్వీస్
Vijayawada to Delhi: దేశ రాజధాని ఢిల్లీతో విజయవాడకు కనెక్టివిటీ పెంచే క్రమంలో కొత్త విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా మరో సర్వీసును సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులో తెస్తారు.
Vijayawada to Delhi: విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, అమరావతికి ప్రాధాన్యం కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి ఢిల్లీకి మరో సర్వీసును కేంద్ర మంత్రి ప్రకటించారు.
విజయవాడ నుంచి ఢిల్లీకి సెప్టెంబర్ నుంచి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుందని రామ్మోమన్ నాయుడు ప్రకటించారు. ఈ విమాన సర్వీసులు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రెండు సర్వీసులు విజయవాడ-ఢిల్లీ మధ్య నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా సర్వీసుల్ని 2014లో ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా కొత్త రాజధాని కార్యకలాపాలు సాగడంతో మొదట్లో ఉదయం పూట మాత్రమే ఒక సర్వీసును నడిపేవారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో సాయంత్రం కూడా మరో సర్వీసును ప్రారంభించారు.
విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీలో పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా ఫ్లైట్ టైమింగ్స్ రూపొందించారు. ఢిల్లీ సర్వీసులకు ప్రయాణికుల నుంచి చక్కటి ఆదరణ లభించింది. 80-90శాతం ఆక్యుపెన్సీతో ఈ సర్వీసులు నడిచేవి. ఒక్కోసారి విమానంలో టిక్కెట్లు లభించడం కూడా కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మరో సర్వీసును అందుబాటులోకి తీసుకు రావాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం ఉదయం 8 తర్వాత మరో సర్వీసు లేక పోవడంతో పగటి పూట మరో విమానాన్ని ఢిల్లీకి నడపాలని ప్రయాణికులు, వ్యాపార వర్గాల నుంచి డిమాండ్ ఉంది. విజయవాడ నుంచి కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకరించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో గురువారం పోస్టు చేశారు. ' 'విజయవాడలో ఉదయం 11. 10 గంటలకు విమానం బయలుదేరుతుందని, మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీ చేరుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి.. విజయవాడకు 10.40 గంటలకు చేరుకుం టుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే విమాన సర్వీసు వల్ల రాజధాని అమరావతి, దిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి" అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.