Atchannaidu : టీడీపీకి మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా? నెలల తరబడి సెక్షన్ 30 వినియోగంపై కోర్టుకెళ్తాం- అచ్చెన్నాయుడు-vijayawada tdp leader atchannaidu alleged police restrictions section 30 only for tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Atchannaidu : టీడీపీకి మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా? నెలల తరబడి సెక్షన్ 30 వినియోగంపై కోర్టుకెళ్తాం- అచ్చెన్నాయుడు

Atchannaidu : టీడీపీకి మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా? నెలల తరబడి సెక్షన్ 30 వినియోగంపై కోర్టుకెళ్తాం- అచ్చెన్నాయుడు

Bandaru Satyaprasad HT Telugu
Oct 07, 2023 05:23 PM IST

Atchannaidu : సెక్షన్ 30, ఆంక్షలు వైసీపీ వాళ్లకు వర్తించవా? టీడీపీకి మాత్రమే వర్తిస్తాయా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నెలల తరబడి అమలుచేస్తున్న ఆంక్షలపై కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

Atchannaidu : పోలీస్ యాక్ట్ సెక్షన్-30, 144 సెక్షన్ దుర్వినియోగంపై కోర్టుకెళ్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 144 సెక్షన్, ఆంక్షలు ప్రతిపక్షాలకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు సురక్ష కార్యక్రమం అంటూ రోడెక్కడంలేదా? అని మండిపడ్డారు. ఆంక్షల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్షన్ 30ని నెలల తరబడి అమలుచేస్తారా? అని నిలదీశారు. పోలీసులు ఆంక్షల పేరుతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సెక్షన్-30 విపరీతంగా వినియోగించడంపై కోర్టుకెళ్తామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై చర్చిస్తున్నామన్నారు. బాలకృష్ణ తెలంగాణ టీడీపీ లీడర్లతో చర్చిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో పోటీపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్ అవినీతికి పాల్పడ్డారని సీబీఐ, ఈడీ నిర్థారించాయని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎలాంటి ఆధారాల్లేకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

నెలల తరబడి సెక్షన్ 30

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ పాలన జరుగుతోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సెక్షన్ 30 విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే అమలుచేస్తారని, అదికూడా ఒకటి, రెండు రోజులు పెడతారన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక నెలల తరబడి సెక్షన్ 30 అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న పోలీసు అధికారులు, రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నిరసనలను అడ్డుకోవడంపై కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకటించారు. తప్పు చేసే పోలీసుల్ని కోర్టుల ద్వారానే శిక్షిస్తామన్నారు. టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో వైసీపీ భారీ సమావేశం పెడుతోందని, ఆ కార్యక్రమం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తవా? అని డీజీపీని ప్రశ్నిస్తున్నామన్నారు. చట్టం వైసీపీ వాళ్లకు మాత్రమే చుట్టమా? అని నిలదీశారు. టీడీపీ నేతలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతామని లిఖితపూర్వకంగా తెలియచేస్తున్నా పోలీసులు మా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాంతియుత నిరసనలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అచ్చెన్నాయుడు అన్నారు.

కాంతితో క్రాంతి కార్యక్రమం

రాష్ట్రం, ప్రజలు నష్టపోకూడదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కూడదనే ఆలోచిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. మొన్న మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ప్రజలు స్వచ్చందంగా మోత మోగించి నిరసన తెలిపారన్నారు. గాంధీ జయంతి నాడు సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిస్తే, ప్రజలు వారి ఇళ్లల్లో ఉండే నిరాహార దీక్షలు చేశారన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల నిరసనల నుంచి వచ్చే కాంతితో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ కు కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అని హడావుడి చేసి అందులో నారా లోకేశ్ ప్రమేయం ఉందని ఆరోపించారని, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళితే ఆయనకేమీ సంబంధం లేదని ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

Whats_app_banner