Kodikatti Case: కోడికత్తి కేసుపై నేడు విచారణ, హాజరు నుంచి మినహాయింపు కోరిన సిఎం
Kodikatti Case: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై సోమవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు సీఎం జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సిఎం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
Kodikatti Case : ఐదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కోడికత్తి కేసు పెద్ద సంచలనం సృష్టించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డిపై ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అయింది. ఈ కేసులో అరెస్టైన నిందితుడికి ఇప్పటికీ బెయిల్ రాలేదు. కేసును విచారిస్తున్న న్యాయస్థానం బాధితుడైన సీఎం జగన్ కోర్టుకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. నేడు ఈ కేసు విచారణ జరగనుంది. అయితే సీఎం జగన్ వ్యక్తిగత హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
కోడి కత్తి కేసును సోమవారం విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ కేసులో బాధితునిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు రావాలని గత వాయిదా సందర్భంగా మెజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఇప్పటికే కోర్టును అభ్యర్ధించారు. విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి కేసుకు సంబంధించి సోమవారం జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
కోడికత్తి మిస్ అయ్యిందా…?
2018 అక్టోబరులో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. ఈ కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణకు బాధితుడు, సాక్షిగా ఉన్న జగన్ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసింది. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని సీఎం జగన్ కోర్టును కోరారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి నిందితుడు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నాడు. అతడికి బెయిల్ కూడా రాలేదు. దాడికి పాల్పడిన కోడి కత్తి గురించి ఎన్ఐఏ న్యాయమూర్తి గత విచారణలో ఆరా తీశారు. ఆ కత్తిని కోర్టులో ప్రవేశ పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ఆ కోడి కత్తి కనిపించడంలేదని ప్రచారం జరుగుతోంది.
అసలేం జరిగింది?
2018లో విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత, సీఎం జగన్‌పై జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావ్వాల్సి ఉండేది. అందుకే గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లేవారు.
జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు.