Chandrababu : చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యలు, హైకోర్టుకు నివేదిక-vijayawada news in telugu tdp chief chandrababu health condition report submitted to ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యలు, హైకోర్టుకు నివేదిక

Chandrababu : చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యలు, హైకోర్టుకు నివేదిక

Chandrababu : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై న్యాయవాదులు హైకోర్టుకు నివేదిక అందించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఇతర ఆరోగ్య సమస్యలపై వైద్యుల మెమో సమర్పించారు. చంద్రబాబుకు గుండె సమస్యలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.

చంద్రబాబు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. చంద్రబాబుకు ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది. కంటి ఆపరేషన్ అనంతరం వైద్యులు చేసిన సూచనలు, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. చంద్రబాబు కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారని, ఆయన కోలుకునేందుకు మందులు వాడాలని సూచించారన్నారు. చంద్రబాబుకు ఐదు వారాల పాటు కంటి చెకప్ కోసం వైద్యులు షెడ్యూల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఐదు వారాల పాటు కంటికి ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేయించుకోవాలని వైద్యు తెలిపారన్నారు. దీంతో పాటు ఐదు వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని సూచించారన్నారు. దీంతో పాటు వైద్య పరీక్షల్లో చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిందని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. గుండె పరిణామం పెరిగిందని, రక్త ప్రసరణ నాళాల్లో సమస్యలున్నాయని వైద్యులు తెలిపారని నివేదికలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు.

స్కిల్ ఎలర్జీ పెరిగింది

దీంతో పాటు చంద్రబాబు డయాబెటిస్ అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారని లాయర్లు నివేదికలో తెలిపారు. చంద్రబాబు స్కిన్ ఎలర్జీ ఉండడంతో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారన్నారు. స్కిన్ ఎలర్జీ పెరిగిందని వైద్య పరీక్షల్లో తెలిసిందన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో 24 గంటల పాటు అంబులెన్స్‌లో నిపుణుడైన వైద్యులు ఉండాలని సూచించారని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. బుధవారం విచారణలో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో మిగిలిన వాదనలు గురువారం వింటామని కోర్టు తెలిపింది.