Dense Fog : పొగమంచు ఎఫెక్ట్- హైదరాబాద్ విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లింపు-vijayawada news in telugu fog effect hyderabad flights shifted to gannavaram airport ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dense Fog : పొగమంచు ఎఫెక్ట్- హైదరాబాద్ విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లింపు

Dense Fog : పొగమంచు ఎఫెక్ట్- హైదరాబాద్ విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లింపు

Bandaru Satyaprasad HT Telugu
Dec 25, 2023 12:44 PM IST

Dense Fog : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొంగమంచు కారణంగా హైదరాబాద్ రావాల్సిన విమానాలను గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించారు.

ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు
ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు

Dense Fog : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. గత రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఉష్ణో్గ్రతలు కనిష్టానికి పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్ పోర్టులకు దారిమళ్లిస్తున్నారు. మూడు విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఛత్తీస్‌గడ్‌, తిరువనంతపురం, గోవా నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత వారిని తిరిగి గమ్యస్థానాలకు తరలించనున్నారు.

విమానాలు దారిమళ్లింపు

సోమవారం ఉదయం గం.07:35 లకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు. రియాద్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానం, జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలను బెంగళూరు, నాగపూర్‌, గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించినట్లు శంషాబాద్ అధికారులు తెలిపారు.

ఏపీ, తెలంగాణలో చలి పంజా

ఏపీ, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. నేటి ఉదయం నుంచి విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ పొగమంచుతో జగ్గయ్యపేట వద్ద వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై-కలకత్తా హైవేపై కూడా పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం అవుతున్నా పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది.

కనిష్టానికి ఉష్ణోగ్రతలు

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అసిఫాబాద్‌లో 8 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 8.5, బేలలో 9.1, బజార్‌హత్నూర్‌లో 9.3, బోథ్‌, నిర్మల్‌లో 9.5, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏపీలో కూడా చలి గాలుల తీవ్రత పెరిగింది. మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. లంబసింగి, పాడేరు, చింతపల్లిలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

Whats_app_banner