Sachivalaya Employees : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి - ఉద్యోగుల సమాఖ్య
Sachivalaya Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, బదిలీలు చేపట్టాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. తమ సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Sachivalaya Employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న రూల్స్ అన్నీ తమకు వర్తింపజేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కోటేశ్వరరావు... ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సోమవారం భేటీ అయ్యారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ, తమ సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి
సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తైన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని కోటేశ్వరరావు కోరారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని, యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మిగతా ప్రభుత్వ శాఖలకు వర్తిస్తున్న రూల్స్ సచివాలయ ఉద్యోగులకు వర్తించేలా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో కమిటీ వేసి త్వరలో పరిష్కరించాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
మీ సేవా కేంద్రాల్లో అర్జీలు
ఏపీ సేవా, మీ సేవా కేంద్రాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 400కు పైగా పౌర సేవల్ని ఏపీ సేవా, మీ సేవా పోర్టళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి దరఖాస్తులు భౌతిక రూపంలో అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భౌతిక రూపంలో వచ్చే దరఖాస్తుల్ని ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు.
వాలంటీర్ల గ్రూప్ లు తొలగింపు
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసిన వాలంటీర్లలో రాజీనామాలు చేసిన వారు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తుడంటం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాలంటీర్లు ఏర్పాటు చేసిన గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయాల శాఖ డైరెక్టర్… కలెక్టర్లను ఆదేశించిచారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న ప్రజలు కూడా అయా గ్రూపుల నుంచి వైదొలిగేలా విస్తృత అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాట్సప్ గ్రూపుల తొలగింపుపై మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను రాష్ట్ర సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు.
సంబంధిత కథనం