Undi Mla RRR Issue : అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు, ద‌ళిత సంఘాల ఆందోళనలు-undi mla raghu rama krishna raju removed ambedkar flexi in yelurupadu dalith organization protests ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Undi Mla Rrr Issue : అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు, ద‌ళిత సంఘాల ఆందోళనలు

Undi Mla RRR Issue : అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు, ద‌ళిత సంఘాల ఆందోళనలు

HT Telugu Desk HT Telugu
Sep 22, 2024 04:53 PM IST

Undi Mla RRR Issue : ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలోని ఏలూరుపాడులో ఆలయం వద్ద కట్టిన అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామ చించివేశారు. దీంతో అంబేడ్కర్ ను అవమానించారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు, ద‌ళిత సంఘాల ఆందోళనలు
అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు, ద‌ళిత సంఘాల ఆందోళనలు

Undi Mla RRR Issue : నిత్యం వివాదాలు, సంచ‌నాల చుట్టూ తిరిగే ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసి ద‌ళిత సంఘాల ఆగ్రహానికి ర‌ఘురామ గుర‌య్యారు. ర‌ఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ద‌ళిత సంఘాలు ఆందోళ‌న చేప‌డుతున్నాయి. ఆయ‌న దిష్టిబొమ్మల‌ను, చిత్ర ప‌టాల‌ను ద‌గ్ధం చేస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీ బ్యాన‌ర్ శ‌నివారం చించివేశారు. అంతేకాదు త‌న అనుచ‌రులను రెచ్చగొట్టే విధంగా అక్కడ మాట్లాడారు. ఆల‌యానికి ద‌గ్గర ఫ్లెక్సీ క‌ట్టార‌ని, అది హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బతీస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ అయినా ఎవ‌రైనా తాను తొల‌గిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించార‌ని ద‌ళిత సంఘాలు రోడ్డెక్కాయి. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేస్తున్నాయి.

దీంతో పశ్చిమ గోదావ‌రి జిల్లాలో ఉండి, భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. ఏలూరుపాడు, నరసాపురం అంబేడ్కర్ సెంటర్లలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏలూరుపాడులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి దళిత సంఘాలు నిరసన తెలిపాయి. రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని సఖినేటిపల్లి మూడు తూములు అంబేడ్కర్ సెంటర్ వ‌ద్ద ద‌ళిత నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. నరసాపురంలో రఘురామ‌ కృష్ణరాజు ఫోటోలను తగలబెట్టిన దళిత సంఘాల నాయకులకు నిర‌స‌న తెలిపారు. రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేత‌లు డిమాండ్ చేశారు.

బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన‌ రఘురామ కృష్ణరాజును టీడీపీ అధినాయ‌త్వం ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌కు పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఖబర్దార్ అంటూ ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజును హెచ్చరించారు. అయితే త‌న చ‌ర్యను టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు స‌మ‌ర్ధించుకుంటున్నారు. వాళ్లు ఎస్సీలే కాద‌ని, క్రైస్తవులంటూ కొత్త వివాదానికి తెర‌లేపారు. దీంతో ద‌ళిత సంఘాలు స్పందించి ర‌ఘురామ అహంకారంతో వ్యవ‌హ‌రిస్తున్నార‌ని, తాము ఊరుకునేదే లేద‌ని ద‌ళిత నేత‌లు స్పష్టం చేశారు.

గ‌త టీడీపీ ప్రభుత్వంలో 2017లో కూడా ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం చుట్టు వివాదం, గొడ‌వ జ‌రిగింది. అప్పుడు ఈ వివాదం టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు దళిత వ్యతిరేక ముద్రను తెచ్చిపెట్టింది. ద‌ళితులంతా ఏక‌మై నాటి ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా గొంతెత్తారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే నియోజ‌క‌వ‌ర్గంలోని కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసి, వివాదానికి తెర‌లేపారు. దీంతో ద‌ళిత సంఘాలు, అంబేడ్కర్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు