Srikakulam News : కందిరీగల దాడి...ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కందిరీగలు చేసిన దాడిలో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనులకు వెళ్లి తిరిగొస్తున్న వ్యవసాయ కూలీలపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.
ఈ విషాద ఘటన శ్రీకాకుకుళం జిల్లా రణస్థలం మండలం రావాడ పంచాయతీ లంకపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. లంకపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కిల్లారి రమణమ్మ (55), కిల్లారి సూరిక్రిష్ణప్పడు (70), బొంతు కాంతమ్మ, ఇప్పిలి శ్రీరాములు మరి కొంత మందితో కలిసి ఉదయం స్థానికంగా ఓ బొప్పాయి తోటల్లో వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గ్రామంలోని కల్లాల (పశువులు కట్టే ప్రదేశం) దగ్గరికి వచ్చేసరికి కందిరీగల పట్టు కదిలి అవి బయటకు వచ్చాయి.
వీటిని గమనించని వ్యవసాయ కూలీలు అటుగా వెళ్లారు. అంతలోనే ఒక్కసారిగా కందిరీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో కిల్లారి రమణమ్మ, కిల్లారి సూరిక్రిష్ణప్పడు తీవ్రంగా గాయపడ్డారు. బొంతు కాంతమ్మ, ఇప్పిలి శ్రీరాములు పరుగులు తీసి కాస్తా తప్పించుకున్నప్పటికీ, కందిరీగలు వీరిద్దరిని కూడా కుట్టాయి. దీంతో వీరిద్ధరూ స్వల్పంగా గాయపడ్డారు. తోటి కూలీలు, స్థానికులు హుటాహుటిన గాయపడిన నలుగురిని తొలిత కొండ ములగాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ కిల్లారి రమణమ్మ, కిల్లారి సూరిక్రిష్టప్పడు మరణించారు. బొంతు కాంతమ్మ, ఇప్పిలి శ్రీరాములు చికిత్స పొందుతున్నారు. కిల్లారి సూరిక్రిష్ణప్పడుకు భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
కిల్లారి రమణమ్మకు భర్త సత్యం, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో లంకపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు. కూలీ పనులు చేసుకుంటూ బ్రతికే శ్రమజీవులకు ఇలా జరిగిందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.