Vizag Suicide: విశాఖలో విషాదం.. భార్యాపిల్లల్ని బెదిరించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ లోకోపైలట్
Vizag Suicide: విశాఖపట్నంలో లోకోపైలట్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. భార్యాపిల్లల్ని బెదిరించడానికి ఉరి వేసుకునే ప్రయత్నంలో చీర మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
Vizag Suicide: ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే ప్రయత్నంలో పొరపాటున ఉరి బిగుసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని భార్యను బెదిరించే ప్రయత్నంలో, పిల్లల అల్లరిని మాన్పించేందుకు ప్రయత్నం చేసిన తండ్రి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.
అల్లరి చేస్తే తాను చనిపోతానని పిల్లలతో అని బెదిరించిన తండ్రి, నిజంగానే చనిపోయాడు. పొరపాటున ఉరి బిగుసుకుని పిల్ల కళ్ల ఎదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలో చోటు చేసుకుంది. రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పని చేస్తున్న బీహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) గత ఐదేళ్లుగా విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. విశాఖపట్నం నగరంలోని 89 వార్డులో కొత్తపాలెంలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు.
చందన్ కుమార్‌కు ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు చందన్ కుమార్ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
బుధవారం రాత్రి పిల్లలిద్దరూ చందన్ కుమార్ షర్ట్ జేబులోని కరెన్సీ నోట్లను తీసేసి, వాటిని పనికి రాకుండా చించేశారు. దీంతో పిల్లలపై చందన్ కుమార్ కోపాన్ని వ్యక్తం చేశాడు. వారిని కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే చందన్ కుమార్‌కు భార్య అడ్డుపడింది. ఈ సందర్భంగా చందన్ కుమార్‌కు ఆయన భార్యకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇంట్లో తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, ఒత్తిడికి లోనైవుతున్నానని, ఇలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులను చందన్ కుమార్ బెదిరించాడు. అయితే అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటలు వినపించనట్లు వదిలేశారు. దీంతో ఆయన ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీర కట్టి మెడకు చుట్టుకున్నాడు. అలా చేస్తూ భార్య, పిల్లలను భయపెట్టే పయత్నం చేశాడు.
అయితే అంతలోనే పొరపాటున మెడకు చుట్టుకున్న చీర బిగుసుకుపోయింది. వెంటనే స్పందించిన భార్య ఆయనను ఆయను దింపి, మెడకు చుట్టుకున్న చీరను తొలగించింది. అప్పటికే కొన ఊపిరితో చందన్ కుమార్ కొట్టుమిట్టాడుతున్నాడు. భర్తను కాపాడేందుకు భార్య చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో చందన్ కుమార్ మరణించాడు. ప్రశాంతత కోసం భార్య, పిల్లలను బెదిరించే ప్రయత్నంలో ఆయన ఏకంగా కానరాని లోకానికి వెళ్లిపోయాడు.
చందన్ కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో గోపాలపట్నం పోలీసులు గురువారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. చందన్ కుమార్ మృతదేహాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పటల్ (కేజీహెచ్)కి తరలించారు. అక్కడ ఆయనకు పోస్టుమార్టం చేసి, బాడీని కుటుంబ సభ్యులకు అందజేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)