Chittoor tragedy: చిత్తూరు జిల్లాలో విషాదం, బస్సులో గుండెపోటుతో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి
Chittoor tragedy: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉద్యోగానికి వెళ్తున్న ఆర్మీ ఉద్యోగి మార్గమధ్యలోనే బస్సులో గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటి నుంచి విధి నిర్వహణకు బయల్దేరిన వ్యక్తి ఆకస్మిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో ఈ ఘటన జరిగింది.
Chittoor tragedy: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి ఉద్యోగానికి బయలుదేరిన ఆర్మీ ఉద్యోగి, మార్గ మధ్యలోనే బస్సులో గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంభానికి ఆసరాగా నిలబడే పెద్ద దిక్కే కానరానిలోకానికి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్లచీమనపల్లె గ్రామానికి చెందిన రాజారెడ్డి, విజయమ్మ దంపతుల కుమారుడు నవీన్ (32) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం హర్యానాలోని జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నవీన్‌కు భార్య లావణ్య, కుమారుడు హర్ష (4) ఉన్నారు. ప్రస్తుతం భార్య ఏడు నెలల గర్భవతి. కుటుంబాన్ని చూసుకునేందుకు నవీన్ ఇటీవలి సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. నెల రోజుల పాటు కుటుంబంతో ఉన్నాడు. గర్భవతి అయిన భార్య ఆరోగ్యం దగ్గరుండి చూసుకున్నాడు.
సెలవన్ని కుటుంబంతో సంతోషంగా గడిపాడు. సెలవులు పూర్తి కావడంతో ఈనెల 9న హర్యానాకు నవీన్ బయలుదేరాడు. బెంగళూరు నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాడు. ఢిల్లీలో ఆదివారం దిగాడు. ఆదివారం ఢిల్లీ నుంచి హర్యానాకు తాను ఉద్యోగం చేసే ప్రాంతానికి బస్సులో వెళ్లాడు. బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా నవీన్ గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రయాణికులు ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. భర్త ఇక లేరనే విషయాన్ని తెలిసిన వెంటనే భార్య లావణ్య సోమ్మసిల్లిపడిపోయారు. ఇంటి నుంచి సంతోషంగా బయలుదేరిన కుమారుడు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. నవీన్ భౌతికకాయం మంగళవారం (నేడు) గ్రామానికి చేరుకుంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
సహజీవనం చేసిన వ్యక్తిని హత్య చేసిన మహిళ
మద్యానికి బానిసై ఇంటికి రావద్దన్నా వినకుండా వస్తూ గొడవులు చేసిన వ్యక్తిని సహజీవనం చేసే మహిళే హత్య చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వేమనపల్లె గ్రామానికి చెందిన చిన్నబ్బ (55)కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
అయితే దిగువ వేమనపల్లె గ్రామానికి చెందిన మంగమ్మకు ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. ఆమెకు భర్త లేకపోవడంతో ఆమె పిల్లలతో కలిసి పలమనేరు పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. మంగమ్మతో చిన్నబ్బ సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గర అయ్యారు.
చిన్నబ్బ ఏకంగా తన ఇంటిని, కుటుంబాన్ని వదిలేసి మంగమ్మ వద్ద ఉండేవాడు. వీరిద్దరూ సహజీవనం చేసేవారు. అయితే మంగమ్మ ఇద్దరు కుమార్తెలు పెద్దవారు అవ్వడం, ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో దెప్పిపోడవటంతో ఇక ఇలాంటి వద్దనుకు మంగమ్మ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే చిన్నబ్బను ఇక ఇంటికి రావొద్దని మంగమ్మ చెప్పింది.
అయితే ఆమె మాటలను పెడచెవిన పెట్టిన చిన్నబ్బ తప్పతాగి అర్ధరాత్రుళ్లు ఇంటికి వెళ్లి మంగమ్మ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేవాడు. ఆదివారం అర్ధరాత్రి కూడా తప్పతాగి మంగమ్మ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన మంగమ్మ చిన్నబ్బను కత్తితో పొడిచి హత్య చేసింది. తీవ్ర రక్తస్రావంతో చిన్నబ్బ అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే మంగమ్మే సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పలమనేరు పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు)