Anantapuram Tragedy: అనంతపురం జిల్లాలో విషాదం.. రాజకీయ వివాదానికి తల్లికూతుళ్లు బలి
Anantapuram Tragedy: అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ వివాదం తల్లికుతుళ్లను బలి తీసుకుంది. భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆందోళన చెందిన యువతి కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకుంది.
Anantapuram Tragedy:అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ వివాదం తల్లికుతుళ్లను బలి తీసుకుంది. టీడీపీ-వైసీపీ మధ్య చెలరేగిన వివాదంతో తన భర్తను పోలీసులు అరెస్టు చేస్తారేమోనని భయంతో తొమ్మిది నెలల కుమార్తెను చంపి, ఆపై భార్య ఆత్మహత్య చేసుకుంది. రాజకీయ బెదిరింపులే దీనికి కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు.
ఈ ఘటన బుధవారం ఉదయం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మల్లికార్జునపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో మృతిరాలి భర్త శాంతకుమార్ ఉన్నారు. ఆయనపై కేసు నమోదు అవుతుందని విస్తృతంగా ప్రచారం జరగడంతో భార్య మమత తీవ్ర ఆందోళనకు గురైంది.
దీంతో మనస్తాపన చెంది తన తొమ్మిది నెలల కుమార్తెను నీటి తొట్టిలో పడే, ఆపై మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల రోదనలతో ఆ గ్రామం అట్టడికింది. బంధువుల కన్నీరు మున్నీరు అయ్యారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన గొల్ల శాంతకుమార్, మమత (25)లకు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరూ కూడా ఆడపిల్లలే. అందులో మొదటి కుమార్తె అమ్మమ్మ వద్ద ఉంటుంది. రెండో కుమార్తె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రెండో కుమార్తెకు తొమ్మిది నెలలు మాత్రమే వయసు ఉంది.
మల్లికార్జునపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. శాంత కుమార్ వైసీపీ మద్దతుదారుగా ఉంటున్నారు. ఆ గొడవలో శాంతకుమార్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హనుమంతు చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును టీడీపీ నేతలు పెట్టించారు. దీనిపై శాంతకుమార్‌ను బుధవారం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేస్తారేమోనని, జైలు తీసుకెళ్లిపోతారేమోనని భయంతో భార్య మమత తీవ్ర ఆందోళనకు గురైంది.
బుధవారం ఉదయం మొదట తన తొమ్మిది నెలల చిన్నారి కుమార్తెను నీటి తొట్టెలో పడేసింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత మమత ఇంట్లోని బాత్రూమ్‌లో ఉన్న ఇనుప ఊచలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందింది.
కుటుంబ సభ్యులు మమత, ఆమె కుమార్తెను ఎక్కడుందో గుర్తించేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు పరామర్శించారు. అయితే సీఐ హరినాథ్ కేసు నమోదు చేసి, ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)