CM Jagan Party Review: గడపగడపకు మన ప్రభుత్వంపై నేడు సిఎం జగన్ సమీక్ష
CM Jagan Party Review: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఫైనల్ రిపోర్ట్ నేడు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
CM Jagan Party Review: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సిఎం జగన్ నేడు తాడేపల్లిలో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌ఛార్జిలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జగనన్న గృహ సారథుల సమన్వయకర్తలతో భేటీ నిర్వహించనున్నారు.
నేడు నిర్వహించే సమీక్షలోనే ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల్లో చాలామంది గడపగడపకు కార్యక్రమంలో 60-70శాతం కూడా పూర్తి చేయకపోవడంపై ముఖ్యమంత్రి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని పలు మార్లు సమీక్షలు నిర్వహించినా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదనే భావనలో సిఎం జగన్ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు అందిస్తున్న సంక్షేమాన్ని లబ్దిదారులకు వివరించాలని పదేపదే సూచించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేల భవిష్యత్తుపై కూడా నేటి సమయంలో సిఎం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సందర్భంగా అన్ని నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్ని ఉన్న పరిస్థితులు, ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనేలా రూపొందించిన ప్రణాళికను వెల్లడించనున్నారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని జగన్ చెబుతున్నారు. కేంద్రంతో పాటు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎన్నికల గడువు తగ్గితే అందుకు అనుగుణంగా నేతలు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం ఎవరికి మూడుతుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది.