Tirumala Brahmotsavam: భ‌క్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ముఖ్య తేదీలివే-tirumala tirupati brahmotsavalu starts from 27th september full schedule are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam: భ‌క్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ముఖ్య తేదీలివే

Tirumala Brahmotsavam: భ‌క్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ముఖ్య తేదీలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 02, 2022 07:10 PM IST

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.

సెప్టెంబర్ 27 నుంచి బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 27 నుంచి బ్రహ్మోత్సవాలు (twitter)

Tirumala Brahmotsavalu 2022: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

సెప్టెంబరు 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి అక్టోబ‌రు 5 (9 రోజులు) వ‌ర‌కు ఆల‌య మాడవీధుల్లో వివిధ రకాల వాహ‌న‌సేవ‌ల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో స్వామివారు విహరించనున్న నేపథ్యంలో భక్తుల భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tirumala Brahmotsavam schedule: ముఖ్యమైన రోజులు:

సెప్టెంబర్ 26 న రాత్రి 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ

సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుంచి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.

సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.

సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.

సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.

అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.

అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.

అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.

అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.

అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణ సేవలు ఉంటాయి.

IPL_Entry_Point