TTD : తిరుమల శ్రీవారికి కాసుల వర్షం…. జులైలో కొత్త రికార్డు….-ttd got record level income in the month of july ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : తిరుమల శ్రీవారికి కాసుల వర్షం…. జులైలో కొత్త రికార్డు….

TTD : తిరుమల శ్రీవారికి కాసుల వర్షం…. జులైలో కొత్త రికార్డు….

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 09:30 AM IST

తిరుమల శ్రీవారి ఆదాయం అంతకంతకు పెరిగిపోతోంది. ఊహించినట్లే జులైలో రికార్డు స్థాయి ఆదాయం నమోదైంది. గత ఐదు నెలలుగా శ్రీవారికి భక్తులు సమర్పించే ఆదాయం క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉంది. గత జులైలో రికార్డు స్థాయి ఆదాయాన్ని టీటీడీ నమోదు చేసింది.

తిరుమల శ్రీనివాసుడికి భారీగా ఆదాయం
తిరుమల శ్రీనివాసుడికి భారీగా ఆదాయం

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. గత మే నెలలో రికార్డు స్థాయి ఆదాయం శ్రీవారికి లభిస్తే తాజాగా మే రికార్డులు కూడా చెరిగిపోయాయి. జులై నెలలో తిరుమల శ్రీవారికి రూ.139.4 కోట్ల రుపాయల ఆదాయం లభించింది. మే నెలలో గరిష్టంగా రూ.130 కోట్ల రుపాయల ఆదాయం లభిస్తే జులైలో 21 రోజులకే 100కోట్ల రుపాయల మార్కును టీటీడీ అధిగమించింది. జులైలో మొత్తం రూ.139.4 కోట్ల రుపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. జులై ఆరున ఒక్కరోజులో రూ.6.12 కోట్ల రుపాయలను భక్తులు కానుకలుగా సమర్పించారు. గత ఐదు నెలలుగా తిరుమలలో శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. వందకోట్లకు మించి ఆదాయం భక్తుల కానుకల ద్వారా శ్రీవారికి లభిస్తోంది.

మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం పడుతోంది. ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లుగా నమోదైంది. 81,287 మంది భక్తులు - స్వామివారిని దర్శించుకున్నారు. 34,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వ‌యోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని టిటిడి నిలుపుదల చేసింది.

పట్టాభిషేక మహోత్సవాలు…..

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది. ఆగస్టు 3వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 4న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. దంపతులు రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని టీటీడీ ప్రకటించింది. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

IPL_Entry_Point

టాపిక్