Ban On Marine Fishing: ఏపీలో జూన్ 14వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం…-the andhra pradesh government has imposed a ban on fishing in the territorial waters of andhra pradesh for two months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ban On Marine Fishing: ఏపీలో జూన్ 14వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం…

Ban On Marine Fishing: ఏపీలో జూన్ 14వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం…

HT Telugu Desk HT Telugu
Apr 10, 2023 04:27 PM IST

Ban On Marine Fishing: ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 964కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న సముద్ర జలాల్లో మత్స్యకారులు మర పడవలతో వేటాడటాన్ని రెండు నెలల పాటు నిషేధించారు.

ఏపీలో రెండు నెలల పాటు సముద్ర జలాల్లో చేపల వేటపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో రెండు నెలల పాటు సముద్ర జలాల్లో చేపల వేటపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం (AFP)

Ban On Marine Fishing: ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక మర పడవల ద్వారా నిర్వహించే చేపల వేటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేటను 61 రోజులపాటు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలైన మెకనైజ్డ్ మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకూ మొత్తం 61 రోజుల పాటు వేటను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జి.ఓ. ఆర్ టి. నెం. 76ను ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేశారు.

సముద్ర జలాల్లో చేపల వేట నిషేధించడం ద్వారా పునరుత్పత్తి అవకాశాలను మెరుగుపర్చడం లక్ష్యమన్ని పేర్కొన్నారు. సముద్రంలో లభించే చేపలు రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం ద్వారా వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమన్నారు.

నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు- మెకనైజ్డ్ మరియు మోటారు బోట్లపై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య సంపద అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేటకు చేపడితే ఆయా బోట్ల యజమానులను ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994, సెక్షన్ (4) ననుసరించి శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. నిషిద్ద సమయంలో వేట సాగించే బోట్లను, బోటులో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకోవడంతో పాటు జరిమానా విధిస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను, సౌకర్యాలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం ప్రకటించిన 61 రోజుల నిషిద్ధ కాలం ఖచ్చితంగా అమలు చేయడానికి మత్స్య శాఖ, పోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నావీ మరియు రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశారు. మత్స్య కారులందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner