Tenali Plastic Finger Prints : ఇదేందయ్యా ఇది.. అటెండెన్స్ కోసం ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్
Plastic Finger Prints : కొంతమంది అతి తెలివి చూస్తే.. దిమ్మతిరిగి పోతుంది. బాధ్యత లేని వాళ్లు చేస్తారు తప్పులు అనుకుంటారు. కానీ బాధ్యత గల వైద్య వృత్తిలో ఉండి కూడా తప్పులు చేస్తున్నారు. తాజాగా ఓ ఘటన బయటకు వచ్చింది. ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్ తో డాక్టర్స్ హాజరు వేయిస్తున్నారు.
వైద్యులను చూస్తే.. చేతులు ఎత్తి మెుక్కాలనిపిస్తుంది చాలామందికి. అలా చేతులను చూసి.. చూసి ఓ ఇద్దరు వైద్యులకు ఓ ఆలోచన వచ్చినట్టుగా ఉంది. తమ చేతుల వైపు చూసుకుని.. తప్పుడు పని కోసం వాడుకున్నారు వైద్యులు. వాళ్ల చేతులను వేరేలా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం(Govt) తీసుకొచ్చిన బయోమెట్రిక్(Biometric) విధానాన్ని తమకు అనుకూలంగా చేసుకున్నారు. దానికోసం ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేయించుకున్నారు. మెల్లమెల్లగా గొడవలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
గుంటూరు(Guntur) జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి(Tenali Govt Hospital). అందులో ఇద్దరు వైద్యులు అతి తెలివి ప్రదర్శించారు. రోజు ఆసుపత్రికి వచ్చి.. సాయంత్రం వరకూ ఉండాలంటే వారికి ఇబ్బంది అనిపించినట్టుగా ఉంది. తమ వేలి ముద్రలను ప్లాస్టిక్(Plastic) తో తయారు చేయించారు. వాటిని సెక్యూరిటీ సిబ్బందికి అప్పజెప్పారు. సార్లు చెప్పిన మాట కాదనలేక.. సెక్యురిటీ సిబ్బంది ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్(Plastic Finger Prints)తో హాజరు వేస్తున్నారు.
ఆ వైద్యుల పని ఎలా ఉంటుందంటే.. ఉదయమే ఆసుపత్రికి వస్తారు. ఎవరైనా చూస్తే.. వైద్యులకు సమయపాలన చక్కగా ఉందనుకుంటారు. మధ్యాహ్నం అవ్వగానే ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటారు. అక్కడ నుంచి మెల్లగా జారుకుంటారు. ఇక సాయంత్రం.. సెక్యూరిటీ(Security) సిబ్బంది ప్లాస్టిక్ ఫింగర్ ప్రింట్స్ తో ఆ ఇద్దరు వైద్యుల హాజరు వేసేస్తారు. ఇలా నడిపిస్తున్నారు. అయితే తాజాగా వైద్యుల మధ్య గొడవ వచ్చింది.
వాళ్లు బయటకు అనుకుంటుంటే.. ఎవరో విని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. బయోమెట్రిక్ హాజరు మోసాన్ని గుర్తించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వైద్యులకు నోటీసులు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరులోని లోపాలను వాడుకుని ఇలా చేసిన వైద్యులపై విమర్శలు వస్తున్నాయి.