11 March Telugu News Updates: కవితను ప్రశ్నించిన ఈడీ .. వాంగ్మూలం నమోదు
- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరిగింది. కవితను మొత్తం ఐదుగురు ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా లంచ్, టీ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... విరామం తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. హవాలా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. మరిన్ని తాజా వార్తల అప్డేట్స్ కోసం లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి…
Sat, 11 Mar 202311:55 AM IST
రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత
హైదారాబాద్ లోని రాజ్ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ కవిత పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. మేయర్ తో కలిసి కార్పొరేటర్లు రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా... అపాయింట్ మెంట్ లేదంటూ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో... రాజ్ భవన్ ఎదుటే బైఠాయించిన మేయర్, మహిళా కార్పొరేటర్లు... బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అపాయింట్ మెంట్ కోసం ఉదయం నుంచి కోరుతున్నామని... అయినా గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసి బండి సంజయ్ పై ఫిర్యాదు చేసే వరకు రాజ్ భవన్ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు.
Sat, 11 Mar 202311:11 AM IST
కొనసాగుతున్న కవిత విచారణ
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 : 30 గంటలకు మొదలైన ఈడీ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా 5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు... మధ్యలో కాసేపు విరామం ఇచ్చినట్లు సమాచారం. టీ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభించారని తెలుస్తోంది.
Sat, 11 Mar 202310:55 AM IST
అటవీశాఖ దాడులు
వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం బాలాయపల్లి పరిధిలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రుగురు స్మగ్లర్లు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి వెల్లడించారు.
Sat, 11 Mar 202310:54 AM IST
జనసేన బీసీ సదస్సు
మంగళగిరి జనసేన కార్యాలయంలో బీసీ సదస్సు జరుగుతోంది. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సదస్సుకి హాజరయ్యారు. నేతలు బోనబోయిన శ్రీనివాస్, పోతిన మహేష్ సహా వివిధ జిల్లాల నుంచి జనసేన నాయకులు తరలివచ్చారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కమల సదస్సులో పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆమె హాజరయ్యారు.
Sat, 11 Mar 202310:50 AM IST
ముగిసిన ప్రచార గడువు
రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రంలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Sat, 11 Mar 202310:09 AM IST
బండి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్...
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన కమిషన్... వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని సీరియస్ అయ్యింది. బండి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.
Sat, 11 Mar 202307:31 AM IST
గడువు పెంపు….
హైదరాబాద్ నగరం, పరిసర జిల్లాలతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో ఆక్రమిత స్థలాలకు హక్కులు జారీ చేయనున్నారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గం స్థలాల క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోనున్న గడువును 2014 నుంచి 2020కి పొడిగించేందుకు నిర్ణయించడం లక్షల మందికి కలిసిరానుంది.
Sat, 11 Mar 202307:17 AM IST
CID సోదాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Sat, 11 Mar 202307:10 AM IST
ఆందోళన..
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు.
Sat, 11 Mar 202306:43 AM IST
ప్రత్యేక బృందం విచారణ
లిక్కర్ కేసుకు సంబంధించి కవితను... ఈడీ ప్రత్యేక బృందం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోందని సమాచారం. కవితను మొత్తం ఐదుగురు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారిస్తున్నట్లు సమాచారం.
Sat, 11 Mar 202305:39 AM IST
ఈడీ ఆఫీస్ కు కవిత
లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరారు.
Sat, 11 Mar 202305:19 AM IST
కవితతో చర్చలు
లిక్కర్ స్కామ్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఇదే విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందని మండిపడుతోంది. ఓవైపు ఇదిలా ఉండగా... హైదరాబాద్ నగరంలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. బైబై మోదీ అంటూ పలువురి నేతల ఫొటోలను కూడా ప్రచురించారు.
Sat, 11 Mar 202304:51 AM IST
పార్టీ మారుతారా..?
కిరణ్ కుమార్ రెడ్డి.... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి..! రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పార్టీని కూడా ప్రకటించారు. ఆ తర్వాత... సైలెన్స్ గా ఉండిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి... తిరిగి హస్తం గూటికి చేరారు. ఈ మధ్యనే రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నీ కుదిరితే ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారని జోరుగా చర్చ నడిచింది. సీన్ కట్ చేస్తే.... మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కిరణ్ కుమార్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు సిద్దమైనట్టుగా సమాచారం.
Sat, 11 Mar 202303:27 AM IST
తేదీలు ఖరారు
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Sat, 11 Mar 202302:30 AM IST
25వ రోజుకి చేరిన పాదయాత్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 25వ రోజుకు చేరింది. శనివారం కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఈ మేరకు పలు గ్రామాల మీదుగా వెళ్లనున్న రేవంత్ రెడ్డి... రాత్రి కోరుట్లలో తలపెట్టిన సభలో పాల్గొంటారు.
Sat, 11 Mar 202301:49 AM IST
ఆదేశాలు
మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డిని ఈ నెల 13వ తేదీ సోమవారం వరకూ అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Sat, 11 Mar 202301:47 AM IST
అమిత్ షా హైదరాబాద్ టూర్
Home Minister Amit Shah Hyderabad Visit:ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 08:25కి హకీంపేట ఎయిర్‌పోర్టుకి రానున్న ఆయన... ఆదివారం ఉదయం అధికారిక కార్యక్రమమైన సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి కేరళలోని కొచ్చికి వెళ్తారు. నిజానికి ఇది అధికారిక కార్యక్రమం కాగా.... మరోవైపు తెలంగాణలోని తాజా పరిస్థితులపై నేతలతో కీలక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Sat, 11 Mar 202301:46 AM IST
137 పోలింగ్ స్టేషన్లు
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న నిర్వహించే ఎన్నికకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Sat, 11 Mar 202301:44 AM IST
కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఢిల్లీలో దీక్ష కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన కవిత... ఇవాళ (మార్చి 11) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారించనున్నారు. రామచంద్ర పిళ్లై వాంగ్మూలం, సౌత్ గ్రూపు లావాదేవీలు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై లోతుగా విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.