Opinion: టీడీపీ-జనసేన కూటమికి లెక్కా, లక్ష్యం ఉందా?-tdpjanasena alliance a goal oriented partnership or a mere political expediency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Tdp-janasena Alliance A Goal-oriented Partnership Or A Mere Political Expediency

Opinion: టీడీపీ-జనసేన కూటమికి లెక్కా, లక్ష్యం ఉందా?

HT Telugu Desk HT Telugu
Oct 22, 2023 02:18 PM IST

‘రేపు తొలిసారిగా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సగటు కార్యకర్తల అనుమానాలన్ని పటాంచలవుతాయా…’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ రాజకీయ విశ్లేషణ ఇదీ..

సెప్టెంబరు 14న రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మీడియాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్,చిత్రంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ
సెప్టెంబరు 14న రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మీడియాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్,చిత్రంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ (PTI)

అధికార పార్టీని గద్దె దించేందుకు రెండు ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బాగానే ఉంటుంది. కానీ ఏపీలో వైఎస్సార్సీపీని దించాలనే లక్ష్యంతో ఏర్పడిన టీడీపీ-జనసేన కూటమి కేవలం మీడియా ముందు కలిస్తే ఫలితం ఉండదు. చేతులు కలిపి ఫోటోలకు ఫోజులులిచ్చినంత మాత్రాన ప్రజల్లో నమ్మకం కుదరదు. పొత్తు లెక్క ఓకే... మరి అధికార పార్టీని చిత్తుచేసే లెక్క టీడీపీ-జనసేన కూటమి దగ్గర ఉందా? అనే ఒక అనుమానం క్షేత్రస్థాయిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో రేపు తొలిసారిగా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షత సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సగటు కార్యకర్తల అనుమానాలన్ని పటాంచలయ్యేలా ఒక స్పష్టతను, భరోసాను ఈ సమావేశం ఇస్తేనే... కూటమిపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది!

ట్రెండింగ్ వార్తలు

ఉద్యమాలు మీడియా వరకేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కదిలించే ఒక్క కార్యక్రమాన్నికూడా టీడీపీ నిర్వహించలేకపోయింది. ఎంతసేపూ అనుకూల మీడియా ఎజెండానే ఎత్తుకుని పని చేస్తున్నారు తప్ప, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా నడుచుకున్న దాఖలాలే లేవు. రాజకీయాలు అంటే పూల పాన్పు కాదు. అక్రమ అరెస్టు చేశారంటే ఒకే. కానీ, దోమలు కుడుతున్నాయి, సౌకర్యాలు ఇవ్వడం లేదని రోజూ మీడియాలో, సోషల్ మీడియాలో గగ్గోలు పెడితే ప్రజలు హర్షించరు. అవన్నీ నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే కదా? మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందని నాలుగేళ్లు ఎదురు చూసిన జనసేన అధినేతకు నిరాశే మిగిలింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ముందు నుండి చెప్తున్న జనసేనాని, ఎన్డీఏని కాదని సంక్షోభ సమయంలో ధైర్యంగా అడుగు ముందుకేసి టీడీపీతో పొత్తు ప్రకటించారు. అలా ఈ రెండు పార్టీల మధ్య రాజమండ్రి జైలులో పొత్తు పొడిచింది.

ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే, పొత్తు కుదరగానే విజయం వచ్చి వాలదు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తుపెట్టుకుంది. ఇంతా చేస్తే కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే టీడీపీకి అధికారం దక్కింది. కాబట్టి, కూటమి ఏర్పడగానే, అధికారంలోకి వచ్చేస్తున్నామని చంకలు గుద్దుకోవద్దు. పొత్తు లెక్కలు సరిచూసుకుని, ఒక లక్ష్యం కోసం పని చేయాలి. చెయ్యి చెయ్యి కలిపి నిరంతరం ప్రజల్లో ఉండాలి. రాజకీయం చేస్తున్నామని ప్రతిక్షణం ఈ రెండు పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కలిసి కూటమిని ఒక ఎన్జీవోలాగా నడిపితే... అందరూ పాలు పోస్తున్నారు కదా? మనం నీళ్లు పోస్తే ఏమవుతుందన్న కథే రిపీట్ అవుతుంది. రాజకీయాల్లో రెండో స్థానానికి బహుమతి లేదు, కాబట్టి మొదటి స్థానం కోసం నిత్యపోరాటం చేయాలి. ఎన్నికలకు ఇంకా 150 రోజుల స్వల్ప సమయమే ఉంది. కాబట్టి, వీకెండ్ పాలిటిక్స్, సోషల్ మీడియా పాలిటిక్స్ కి రెండు పార్టీలూ స్వస్తి పలకాలి. రోజూ క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలి. ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. ప్రతి నాయకుడు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీనికోసం ఈ సమన్వయ సమావేశంలో తీర్మానాలు చేయాలి. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తొమ్మిది సంవత్సరాలు ప్రతి రోజు ఎన్నికలాగే కష్టపడ్డారు. జగన్ ప్రత్యేర్థే అయినా ఆయనలాంటి పట్టుదలను పునికిపుచ్చుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉన్నందున 150 రోజులు కష్టపడి పని చేస్తే కూటమి ఒడ్డు చేరడం కష్టమేం కాదు.

సమయం లేదు మిత్రమా

పొత్తు గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నా... కార్యచరణ మాత్రం నత్తనడకన సాగడం శుభపరిణామం కాదు! పొత్తు ప్రకటించిన నెల రోజుల తర్వాత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారంటే... వారి పనితీరులో ఎంత వేగం ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఈ పొత్తు విషయంలో ప్రజలకు ఉన్నంత ఆతృత టీడీపీ-జనసేనలకు లేకపోవడం శోచనీయం! రెండు పార్టీలు కేవలం ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావని చరిత్ర ఇప్పటికే ఎన్నో గుణపాఠాలు చెప్పింది. మీడియా ముందు ఇరుపార్టీల అధినేతలు చేతులు కలిపినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేతులు కలపలేరు. వారి మధ్య ఒక అవగాహన రావడానికి సమయం పడుతుంది. వ్యక్తిగత ఎజెండాను, అహాన్ని పక్కనపెట్టి ఒకరిపట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసంతో పనిచేయాలంటే, ఉమ్మడి కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలి. ఈ దిశగా అడుగులు వేసేందుకు టీడీపీ-జనసేన కూటమి ఈ సమావేశంలో ప్రణాళికలు రచించాలి. ఏళ్ల తరబడి వైరం కొనసాగించిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు 1999-2004 మధ్య నాలుగేళ్లు కలిసి పోరాటం చేయడం వల్లే ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. జనసేన-టీడీపీ కూటమికి అలా నాలుగేళ్ల సమయం లేదు! కానీ, వచ్చే నాలుగు నెలలైనా క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి నాయకుడి వరకు కలిసి పనిచేస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది.

సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి, అనవసర విషయాలపై సమయం వృథా చేయకుండా వచ్చే ఎన్నికల్లో లక్ష్య సాధన దిశగా వ్యుహ రచన చేయాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. ఒకటి ఉమ్మడిగా చేపట్టే ఆందోళన కార్యక్రమాలు, రెండోది తమ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీఎంపీ), మూడోది కామన్ పొలిటికల్ ప్రోగ్రాం (సీపీపీ). నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. క్షేత్రస్థాయిలో జనసముహాన్ని ఒక్కటి చేసేలా ఉమ్మడి కార్యక్రమం రూపొందించడం తక్షణ కర్తవ్యంగా భావించాలి. రాష్ట్ర శ్రేయస్సు కోసం అధికార పార్టీ దాష్టికాలకు నిరసనగా తాము ఒక్కటయ్యాం తప్ప, అధికార దాహంతో కాదనే సందేశం ఈ సమావేశం ఇవ్వగలగాలి.

ఈ సమావేశం ముందున్న అతిపెద్ద సవాల్... మీడియా! ఈ కూటమి ఏర్పడకుండా చూడాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్న తరుణంలో, వైఎస్సార్సీపీ అనుకూల మీడియా సీట్ల పంపకాలు, ముఖ్యమంత్రి ఎవరు? పదవుల పంపకం ఎలా ఉంటుంది? అనే విషయాల్ని గుచ్చి గుచ్చి అడుగుతాయి. ఈ సమాశం తర్వాత బయటకు వచ్చి స్పష్టమైన అవగాహన లేకుండా మాట్లాడితే మీడియా, సోషల్ మీడియా వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ప్రజల్లోకి ఒకే సందేశం వెళ్లేలా, ఉమ్మడి కార్యక్రమాలను మీడియాకు వివరించడానికి ఇరుపార్టీల నుంచి అధికార ప్రతినిధులను నియమించుకోవాలి. కార్యకర్తలు, నాయకుల్లో మనస్పర్థలు పెరగకుండా కామన్ పొలిటికల్ ప్రోగ్రాం ద్వారా భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ, రాజ్యసభ, వివిధ కార్పోరేషన్లు, దేవాదాయ కమిటీలు మొదలగు పదవుల్లో జనసేన, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉంటుందనే భరోసా కల్పించాలి.

పేదలకు, పెత్తాందర్లకు మధ్య ఈసారి క్లాస్ వార్ జరగబోతోందని, కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్సార్సీపీ ఊరు-వాడ ప్రచారం చేస్తోంది. కాబట్టి, వైఎస్సార్సీపీ అందిస్తున్న పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కూటమి ఎలా వివరిస్తుందో చూడాలి. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు భరోసా కల్పించేలా రూపొందించే పథకాలు, ప్రణాళిలకపై ఇరు పార్టీలు కలిసి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, నిత్యవసరాల ధరలు పెంచి సంక్షేమ పథకాల ద్వారా ఒక చేత్తో ఇంకో చేత్తో లాక్కుంటున్నారనే భావన ప్రజల్లో ఉంది. రాజధాని లేక కొత్త కంపెనీలు రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు లేవని యవత అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రం అప్పులతో దివాళ తీసిందని, కక్ష సాధింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి ఆనవాళ్లే లేవని అంతా నిరాశలో ఉన్నారు.

ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రానికి ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయని చేస్తున్న ఆరోపణలకు ఊతంగా ప్రధాన సమస్యలు ప్రతిబింబించేలా ప్రజల ఆకాంక్షల్నిసీఎంపీలో చేర్చాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ సీఎంపీలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కూటమి ఏమేం చేయాలో...మేధావులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు కోరడానికి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లేదా వెబ్ సైట్ క్రియేట్ చేయాలి. వారి సూచనలకు సీఎంపీలో చోటు కల్పించాలి. టీడీపీ ఇప్పటికే మినీ మెనిఫోస్టో విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు. ఈ అంశాలన్నీ తమ సీఎంపీలో పొందుపరచాలి. పైగా, ఈ సీఎంపీ విడుదలకు స్పష్టమైన తేది ప్రకటించాలి. ఆలస్యం, అమృతం, విషం అన్నట్టు... ఆలస్యం చేస్తే సీఎంపీని గడగడపకు తీసుకెళ్లే అవకాశమే కూడా కోల్పోతారు.

ఒకవైపు, జగన్ వాయిస్ మెసేజ్ తో వివిధ కులాలకు తమ ప్రభుత్వం అందిచిన లబ్ది గురించి వివరిస్తుంటే, సోషల్ మీడియాను నమ్ముకుంటూ టీడీపీ, జనసేన సోషల్ ఇంజినీరింగ్ లో వెనకపడ్డాయి. దీనికి విరుగుడు కనిపెట్టకపోతే, ప్రజలను ఆకట్టుకోవడం ప్రతిపక్షాలకు కత్తిమీద సామే అవుతుంది. కూటమి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకోవడానికి ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలి. రాయలసీమ, ఆంధ్రా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్న సామాజిక పరిస్థితులను అధ్యాయనం చేసి, అక్కడి వాతావరణానికి అనుకూలంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి తమవైపు తిప్పుకోవాలి. మీడియా ఎజెండాను పక్కనపెట్టి, ప్రజల ఎజెండాను భుజానెత్తుకోవాలి. ప్రజల ఆకాంక్షలు, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక లెక్క, లక్ష్యంతో ముందుకెళ్లగలిగితినే టీడీపీ-జనసేన కూటమి కల సాకరమవుతుంది!

-జి. మురళీ కృష్ణ,

రీసర్చర్, పీపుల్స్ పల్స్ సంస్థ

జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్
జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్

Disclaimer: ఈవ్యాసంలో తెలియపరిచిన రాజకీయ విశ్లేషణ, అభిప్రాయం, వ్యూహం వ్యాసకర్తివి మాత్రమే. హెచ్‌టీ తెలుగువి కావు.

WhatsApp channel