Chandrababu Cases : చంద్రబాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు
Chandrababu Cases : టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. అంగళ్లు, ఐఆర్ఆర్ కేసులో అప్పుడే అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని, ఈ దశలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు విచారణకు సహకరిస్తారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
కీలకం కానున్న సుప్రీం ఆదేశాలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా పడింది. చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో అరెస్ట్ చేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో చంద్రబాబు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వాటిని తిరస్కరించింది. దీంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. అంగళ్లు, ఐఆర్ఆర్ కేసుల్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు కాస్త ఉపశమనం కల్పించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఐఆర్ఆర్ కేసులో సోమవారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో వచ్చే నిర్ణయానికి బట్టి చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్ పీటీ వారెంట్ దాఖలు చేశారు.