CBN Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ - సెక్షన్ 17A పై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు, CJ బెంచ్ కు బదిలీ
Chandrababu Quash Plea in Skill Scam Case Updates : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఇచ్చింది. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17 - A వర్తిస్తుందా లేదా అన్న దానిపై ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను ఇచ్చింది.
PChandrababu Quash Plea in Skill Scam Case : తనపై నమోదైన స్కిల్ స్కామ్ కేసును ఛాలెంజ్ చేస్తు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా… ఇవాళ(జనవరి 16) అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ త్రివేది బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే వేర్వురు అభిప్రాయాలను చెప్పారు. చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ చెప్పగా… 17ఏ(Section 17A) వర్తించందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ఫలితంగా ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అయింది. అయితే తుది తీర్పు కోసం… ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ కానుంది.
17ఏ వర్తిస్తుంది - జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ...
"రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయటం కుదరదు. చంద్రబాబు కేసులో 17 ఏ వర్తిస్తుంది. ముందస్తు అనుమతి తీసుకోకపోయినా... రిమాండ్ ఆర్డర్ ను పక్కనపెట్టేయలేం. పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నాను. సెక్షన్ 17ఏలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా చర్యలు చట్ట విరుద్ధం. కానీ రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయటం సరికాదు. రిమాండ్ చెల్లుబాటు కాదని చెప్పలేం" అని జస్టిస్ బోస్ అన్నారు.
జస్టిస్ బేలా త్రివేది తీర్పు...
“17ఏ అమల్లో లేనప్పుడు నేరాన్ని వర్తింపజేయలేం. ఈ కేసులో 17ఏ వర్తించదు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసులకే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం” అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ చూడండి…
01:37PM - ఈ కేసు ఐదుగురి బెంచ్ లతో కూడిన ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సీజే ఎలాంటి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాలి.
01:33PM - తదుపరి విచారణ కోసం ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కు బదిలీ చేస్తారా లేక ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందా అనేది తేలాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
01:30 PM - ఈ కేసు తీర్పు కీలకం కానున్న నేపథ్యంలో… సీజే బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. విస్తృత ధర్మాసనం ఏర్పాటువుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.
01:29 PM - సీజేకు కేసు బదిలీ అయిన నేపథ్యంలో…. తుది తీర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
01:24 - ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయటంతో… సీజే బెంచ్ కు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు బదిలీ అయింది.
01:23- చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పును ఇచ్చారు.
01:13PM - చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పును చదువుతున్నారు.
12: 58 PM - జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ త్రివేది బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించనుంది.
12:50PM -జస్టిస్ అనిరుద్ధబోస్ ఈ తీర్పును వెలువరించే అవకాశం ఉందని సమాచారం. ఒంటి గంటకు తీర్పు వెలువరించవచ్చు.
12:23 PM - ఇవాళ మధాహ్నం ఒంటి గంట సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
12:22 PM - సుప్రీంకోర్టు 17ఏను అనుసరించి చంద్రబాబుపై స్కిల్ కేసు కొట్టేస్తుందా? లేదంటే చంద్రబాబు పిటిషన్‌నే కొట్టేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
12:20 PM - సెక్షన్ 17ఏ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణగా మారొద్దని ప్రస్తావించారు. ఏ పరిస్థితుల్లో 17ఏను తీసుకువచ్చారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు సీఐడీ తరపు లాయర్లు.
12 :19 PM - ఈ కేసులో ఏపీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఈ కేసులో సెక్షన్ 17ఏ పాటించాల్సిన అవసరం లేదని చెబుతోంది. కేసు నమోదును 2018 ఏడాదిగా చూపుతోంది.
12: 17 PM - అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. 2018 జులై 26 నుంచి సెక్షన్ 17ఏ అమల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేసి, 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని న్యాయస్థానికి చెప్పారు.
12:16 PM - చంద్రబాబు క్వాష్ పిటిషన్ గతేడాది అక్టోబరు 3కు తొలిసారి జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాల పడింది.
12:10 PM -స్కిల్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ్నుంచి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.