Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...! ప్రొఫెస‌ర్ అరెస్ట్-student attempted suicide by sexual harassment of professor in anakapalli district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...! ప్రొఫెస‌ర్ అరెస్ట్

Anakapalli News : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...! ప్రొఫెస‌ర్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Aug 31, 2024 11:36 AM IST

అన‌కాప‌ల్లిలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంజ‌నీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ లైంగిక వేధింపుల‌తో విద్యార్థిని ఆత్యహత్యాయత్నానికి పాల్ప‌డింది. దీంతో బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ ప్రొఫెస‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆ ప్ర‌బుద్ధుడిని రిమాండ్‌కు పంపారు.

విద్యార్థినికి వేధింపులు (representative image )
విద్యార్థినికి వేధింపులు (representative image ) (image source from unsplash.com)

విద్యా బుద్ధులు నేర్పించి, ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరేలా ప్రోత్స‌హించాల్సిన‌ ప్రొఫెస‌రే వికృత బుద్ధిని చాటాడు.  కూతురు వయ‌స్సు ఉన్న విద్యార్థినిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో మాన‌వీయ విలువ‌ల‌ను మంట‌గ‌లిపాడు. విద్యార్థుల‌ను చ‌క్క‌గా తీర్చిదిద్దాల్సిన గురువులే ఇలాంటి నీచ‌మైన ప‌నుల‌కు ఒడిగ‌ట్ట‌డంతో స‌భ్య‌త, సంస్కారాల‌ను మంట‌గ‌లిపిన‌ట్లు అయింది.

అన‌కాప‌ల్లిలోని ఓ ఇంజ‌ినీరింగ్ కాలేజీలో మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అసోసియేట్‌ ఫ్రొఫెస‌ర్ ప‌ల్లా వెంక‌ట ముర‌ళి త‌న‌ను ఏడాది కాలంగా వేధిస్తున్నాడ‌ని ఇంజినీరింగ్ సెకండియ‌ర్ విద్యార్థిని చెప్పింది. ప్ర‌తిరోజూ రాత్రులు త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడాల‌ని… వాట్సాఫ్ మెసేజ్‌లు చేయాల‌ని వేధిస్తున్నట్లు పేర్కొంది. 

ఆ ప్ర‌బుద్ధుడి వేధింపులు భ‌రించ‌లేక త‌న స్నేహితుడికి స‌మ‌స్య‌లు వివ‌రించ‌డంతో ఇటీవ‌ల ఆ యువ‌కుడు అసోసియేట్ ప్రొఫెస‌ర్‌ ముర‌ళిని ప్ర‌శ్నించాడు. అయితే సదరు విద్యార్థిపై ముర‌ళి దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. 

ప్రొఫెస‌ర్ ముర‌ళీ ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కాలేజీలోని ఉన్న‌తాధికారులకు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. అయిన‌ప్ప‌టికీ స్పంద‌న లేక‌పోవ‌డంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అయితే పోలీసులు కూడా విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా ర‌హ‌స్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ విద్యార్థిని బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌యత్నం చేసింది. దీంతో త‌ల్లిదండ్రులు అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీశారు.

దీంతో శుక్ర‌వారం బాధితురాలి త‌ల్లిదండ్రులు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి త‌న కుమార్తె ప‌ట్ల అసోసియేట్ ప్రొఫెస‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసి… నిందితుడిని అరెస్టు చేశారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ చెప్పారు.  అసోసియేట్ ప్రొఫెస‌ర్ ముర‌ళి గ‌తంలో చాలా మంది ప‌ట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner