AP Welfare Pensions: అసలైన అర్హులకే సామాజిక పెన్షన్లు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్-social pensions only for genuine beneficiary verification of pensions across the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Welfare Pensions: అసలైన అర్హులకే సామాజిక పెన్షన్లు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్

AP Welfare Pensions: అసలైన అర్హులకే సామాజిక పెన్షన్లు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 20, 2024 06:30 AM IST

AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ల తనిఖీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నారనే సమాచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అర్హులకే పెన్షన్లుఅందించేందుకు సిద్ధం అవుతోంది. దీని కోసం సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్
మంత్రి కొండపల్లి శ్రీనివాస్

AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు త్వరలో సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.

సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫు పై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూడటం, సెర్ఫు పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తి వంతంగా సెర్పు పనిచేసేలా దిశ నిర్థేశాన్ని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.

సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు. అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు.

పెన్షన్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్లకే పింఛను మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చజరిగిందని, రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మద్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగిందని, అయితే వారికి పింఛను అందజేసే విదానంపై త్వరలో జరుగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. వడ్డీ లేని ఋణాలు, మహిళా శక్తి

టీడీపీ హయాంలోనే 1995 సంవత్సరంలో డ్వాక్రా సంఘాల వ్యవస్థను ప్రారంభించారని , 2002 లో వెలుగు శాఖను ఏర్పాటు చేయగా దాన్ని 2009 లో సెర్ప్‌గా మార్చినట్టు చెప్పారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు సెర్పు వ్యవస్థను ఏర్పాటు చేయడం అయిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, వీరందరి జీవనోపాది కోసం ఋణాలు అందజేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు టర్నోఓవర్ అవుతుందన్నారు.

వీరిలో కేవలం 54 లక్షల మందే జీవనోపాది కార్యక్రమాల నిర్వహణకు బుణాలు తీసుకోగా, మిగిలిన వారు తమ సొంత ఖర్చులకై ఋణాలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అయితే వీరందరూ కూడా స్వయం ఉపాధి కార్యక్రమాల నిర్వహణపై శ్రద్ద చూపేలా తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఋణ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చే విధంగా, ఆదాయాన్ని అభివృద్ది పర్చే కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేపట్టే విదంగా మరియు అక్రమాలకు, అవినీతికి ఆస్కారం లేని విదంగా డ్వాక్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకై ప్రణాళికా బద్దంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలు మండలంలో బోగస్ గ్రూపులను చూపిస్తూ దాదాపు రూ.7 కోట్ల నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. అటు వంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. దాదాపు రూ.80 వేల కోట్ల మేర ఋణాలు ఎస్.హెచ్.జి.ల వద్ద ఉన్నాయని, అయితే అందులో కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే వినియోగం ఉండగా, మిగిలిన రూ.30 వేల కోట్లు బ్యాంకుల్లో నిరుపయోగం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సమస్యలను అదిగమించేందుకు స్వయం సహాయ బృందాలను చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాయికి అభివృద్ది పర్చే విధంగా దాదాపు పది జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఎస్.హెచ్.జి.లను మైక్రో ఇండస్ట్రీల స్థాయికి అభివృద్ది పర్చే విధంగా చర్యలు తీసుకోనున్నామన్నారు. గ్రామ స్థాయిలో మహిళలు స్వయం ఉపాధి ద్వారా మహిళా సాదికారతను సాదించే విధంగా పలు కాటేజ్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసేందుకు మండల స్థాయిలో దాదాపు ఒక ఎకరం వరకూ స్థలాన్ని అద్దె ప్రాతిపదికై మంజూరు చేయాల్సినదిగా ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు.