Rajampet Boy Died : రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, లే నాన్న ఇంటికి వెళ్దామని తల్లి కన్నీటి రోదన
Rajampet Boy Died : అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రి బెడ్ పై విగతజీవిగా పడిఉన్న చిన్నారి పక్కనే పడుకుని, లే నాన్న ఇంటికి వెళ్లిపోదాం అంటూ ఆ తల్లి పలికిన మాటలు చూపరులు కన్నీటి పర్యంతం చేశాయి.
తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి విలవిల్లాడిపోతుంది. అప్పటి వరకూ తనతో సరదాగా మాట్లాడిన కొడుకు ఇక శాశ్వతంగా మాట్లాడడని తెలిసి ఆ తల్లి గుండె బద్దలైపోయింది. ఆసుపత్రి బెడ్ పై విగతజీవిగా పడిఉన్న చిన్నారి పక్కనే పడుకుని, లే నాన్న ఇంటికి వెళ్లిపోదాం అంటూ ఆ తల్లి పలికిన మాటలు చూపరులు కన్నీటి పర్యంతం చేశాయి. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కొడుకు పక్కనే పడుకుని తల్లి జోకొడుతున్న దృశ్యాలు చూపరులను కలచివేశాయి.
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి చిన్న కుమారుడికి(3) ఆరోగ్య బాగోలేదని పిల్లలిద్దరిని తీసుకుని బైక్ పై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ కు చూపించి, ఇంటికి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. బైక్ ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్(5) ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు బలమైనా గాయమైంది. స్థానికులు వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రి బెడ్ పై శ్యామ్ మృతదేహాన్ని ఉంచగా, కొడుకు పక్కనే పడుకున్న తల్లి శిరీష.... తన బిడ్డ నిద్రపోతున్నాడని జోకొట్టింది. కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళ్లిపోదామని పలికింది. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పెద్దోడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో...అతడు బోరున విలపిస్తూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
ప్రేమోన్మాది ఘాతుకం
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గతంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆ సమయంలో అదే మండలంలోని రాజోలు పంచాయతీ పరిధి రెడ్లపాలేనికి చెందిన కుంచాల భార్గవ్ రెడ్డి.. తనను ప్రేమించాలంటూ ఆమె వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధింపులకు గురిచేసేవాడు.
ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు చదువు మాన్పించి.. బాలికను ఇంటి వద్దే ఉంచారు. అటు తన కుమార్తెకు పెళ్లి చేయాలని బాలిక తండ్రి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన భార్గవ్ రెడ్డి.. తనకు దక్కని బాలిక.. వేరెవ్వరికీ దక్కకూడదని భావించాడు. ఆదివారం అర్థరాత్రి భార్గవ్ రెడ్డి తన స్నేహితుడు విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లాడు.
వారు వచ్చిన చప్పుడు విని నిద్ర లేచిన బాలిక తల్లిదండ్రులు.. ఎవరిని ప్రశ్నించారు. అంతలోనే వెంట తెచ్చుకున్న కత్తి, సుత్తితో బాలిక తల్లిదండ్రులపై భార్గవ్ రెడ్డి దాడి చేశాడు. బాలిక తండ్రి ఛాతీ, వీపుపై కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన అతడి భార్య, కుమార్తెపై కూడా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు నిద్ర లేచి పరుగెత్తుకొచ్చారు. వారి రాకను గమనించిన నిందితుడు.. స్నేహితుడితో కలిసి పరారయ్యాడు.