Honor Killing: అన్నమయ్య జిల్లాలో అమానుషం..మైనర్ బాలిక పరువు హత్య, మృతదేహం కాల్చివేత
Honor Killing: అన్నమయ్య జిల్లాలో అమానుషం జరిగింది. బంధువును ప్రేమ వివాహం చేసుకుంటానన్నందుకు మైనర్ బాలిక పరువు హత్యకు గురైంది. పోలీసులకు సమాచారం అందడతంతో ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని కాల్చివేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Annamayya Honor Killing: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానన్నందుకు మైనర్ బాలికను కుటుంబ సభ్యులే హతమార్చారు. ఆపై మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని మాయం చేయడానికి పోలీసులే సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో మైనర్ బాలిక పరువు హత్యకు గురైంది. గ్రామానికి చెందిన మైనర్ బాలిక గత నెలలో అదృశ్యమైంది. ఈ ఘటనపై తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం ముమ్మరంగా గాలించారు. సాంకేతిక ఆధారాలతో ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగిం చారు. గ్రామానికి చెందిన బంధువైన యువకుడితో బాలిక వెళ్లిపోయినట్టు గుర్తించారు.
కుటుంబ సభ్యులకు అప్పగించిన బాలిక సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలిక తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేశారు. దీంతో గ్రామంలో బాలికను హత్య చేసి శవం మాయం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మైనర్ బాలికను సాధారణంగా ఖననం చేయాల్సి ఉండగా శవాన్ని హడావుడిగా దహనం చేయడంతో పరువుహత్యగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందినా స్థానిక పెద్దల ఒత్తిడికి తలొగ్గారనే ఆరోపణలు ఉన్నాయి. హత్యకు గురైన బాలిక తన బంధువుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతనితో వివాహం జరిపించడానికి బాలిక కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు.
వారిని వెదికి పట్టుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. మైనార్టీ తీరిన తర్వాత వారికి పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పి బాలికను తమతో ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పెద్దమండ్యం మండలం బండ్రేవు పంచాయతీ తపసిమాను గుట్ట వద్ద బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకొని కనిపించింది. బాలిక శవాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు సోమవారం వీఆర్వో పక్కీర్షా వలీకి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై విఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా బాలిక కుటుంబీకులకు మృతదేహం అప్పగించారు.
పోస్టుమార్టం చేస్తే పరువు హత్య వెలుగు చూస్తుందనే నెపంతో గ్రామ పెద్దలు పోలీసుల్ని ఒత్తిడి చేసి శవం లభించిన గుట్టకు సమీపంలోనే పడమర వైపున ఉన్న పొలంలో కాల్చివేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. బాలిక మృతి చెందిన విషయం గ్రామంలో తెలియనివ్వకుండా దహనం చేయడంతో కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. మదనపల్లె డీఎస్సీ కొండయ్య నాయుడి అనుమానాస్పద స్థితిలో బాలిక మరణించినట్లుగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే శవాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వారితో పాటు పోలీసుల ప్రమేయంపై విచారణ జరుపుతామన్నారు.