Chandrababu Health : చంద్రబాబుకు స్కిన్ అలర్జీ, ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక!-rajahmundry tdp chief chandrababu suffering with dehydration skin allergy govt doctors report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Health : చంద్రబాబుకు స్కిన్ అలర్జీ, ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక!

Chandrababu Health : చంద్రబాబుకు స్కిన్ అలర్జీ, ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక!

Bandaru Satyaprasad HT Telugu
Oct 14, 2023 04:18 PM IST

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదికలో చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు ఉందని సమాచారం.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Health : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల జైలులో డీహైడ్రేషన్ గురైన చంద్రబాబు... తాజాగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. అయితే పోలీసులు చెబుతున్న విషయాలకు భిన్నంగా వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఐదు రకాల మెడిసన్ ను వైద్యులు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

yearly horoscope entry point

చంద్రబాబు ఆరోగ్యంపై పోలీసులు ఇలా?

అయితే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ శుక్రవారం మీడియాతో అన్నారు. జైలులో ఉన్న వైద్యాధికారులు రోజుకు మూడుసార్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా, ప్రస్తుతం 67 కేజీల బరువుకు చేరుకున్నారన్నారు. చంద్రబాబు బరువు తగ్గారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. కొంత డీహైడ్రేషన్ కు గురై చర్మ సంబంధిత సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనన్నారు. అయితే వెంటనే డెర్మటాలజిస్టులను రప్పించి చికిత్స అందించామన్నారు. తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టరుకు, పేషెంట్ కు మధ్య ఉండే ప్రైవసీ అన్నారు. చంద్రబాబు రోజూ వినియోగిస్తున్న మందులనే వాడుతున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం తగదన్నారు. జైల్లో 2000 మంది ఖైదీలు ఉంటారన్నారు. వారిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాధ్యత తమపైనే ఉందన్నారు. వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ ఆరోగ్య సమస్యలు రావాలి కదా? అని ప్రశ్నించారు. స్టెరాయిడ్స్ అంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు హెల్త్ బులెటిన్స్ రోజూ విడుదల చేస్తామన్నారు.

భద్రత విషయంలో

చంద్రబాబుకు సంబంధించి భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారని డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. మొదటి నుంచి హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు చంద్రబాబుకు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 24/7 చంద్రబాబుకు ఒక హెడ్ వార్డర్, ఆరుగురు వార్డర్లతో స్నేహ బరాక్ వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు. వీరంతా నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఆహారం, ఇతర అంశాలను తనిఖీ చేసి అందించేందుకు ఒక జైలర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. బయట నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించి లోపలికి పంపుతున్నామని తెలిపారు.

Whats_app_banner