AP Mega DSC 2024 Update: ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ వాయిదా..రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం
AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కానుంది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇది ఆలస్యం కానుంది.
AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల జాప్యం కానుంది. నవంబర్ 6వ తేదీన షెడ్యూల్ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్య పరిణామాల నడుమ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికీ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటంతో కాస్త ఆలస్యంగా విడుదల అవుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 4వ తేదీ సోమవారం ఆన్‌లైన్ టెట్ ఫలితాలను వెల్లడించారు. రెండ్రోజుల వ్యవధిలో 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది.
తాజా పరిణామాల నేపథ్యంలో డిఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ బుధవారం వెలువడటం లేదు. ఎప్పుడు వెలువడుతుందనే దానిపై స్పష్టత కొరవడింది.
అదే కారణమా…
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయవద్దని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మందకృష్ణ భేటీ అయ్యారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పలు అంశాలను సీఎంతో చర్చించారు.
మరోవైపు డిఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం కొలిక్కి రాకపోవడం, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రితో భేటీలో స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కూటమి పార్టీల ఎన్నికల హామీ…
ఏపీలో మెగా డిఎస్సీ నిర్వహణపై అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేశారు. గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా ఎక్కువమంది అభ్యర్థులకు లబ్ది చేకూర్చాలని భావించి టెట్ నిర్వహించారు. దాదాపు 3.68లక్షల మంది టెట్ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 51శాతం క్వాలిఫై అయ్యారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం రేయంబవళ్లు శ్రమిస్తున్నారు.
నవంబర్ 2న టెట్ ఫలితాలు వెలువరించిన మర్నాడే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం మొదట భావించింది. 3వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటించారు. .
నవంబరు 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లు కూడ పూర్తి చేశారు. ఈ నోటిఫికేషన్‌లో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డిఎస్సీలో భర్తీ చేసే పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. నోటిఫికేషన్ వెలువడిన మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు డిఎస్సీ పరీక్షలు పూర్తి చేయాలని షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.
ఈ ఏడాది వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించాలని భావించారు. అనూహ్యంగా రిజర్వేషన్ల అమలు అంశంపై వివాదం నెలకొనడంతో నోటిఫికేషన్ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ అంశం సున్నితమైంది కావడం, మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ విషయంలో జాప్యం జరిగితే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పోస్టుల వివరాలు…
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.