Jr NTR Fan Suicide: ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతిపై రాజకీయ విమర్శలు-political criticism on the suspicious death of actor ntrs fan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jr Ntr Fan Suicide: ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతిపై రాజకీయ విమర్శలు

Jr NTR Fan Suicide: ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతిపై రాజకీయ విమర్శలు

HT Telugu Desk HT Telugu
Jun 28, 2023 06:58 AM IST

Jr NTR Fan Suicide: కోనసీమ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఉద్యోగం చేయడం ఇష్టం లేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా అతని మరణంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.

సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని

Jr NTR Fan Suicide: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మణికంఠ రామ్‌ప్రసాద్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఆత్మహత్యకు ముందు యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేసి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

మృతదేహం ఉన్న తీరుపై బంధువులు, స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్‌ ఉరివేసుకుంటే కాళ్లు నేలకు ఎలా తాకుతాయని, శరీరం, ముక్కుపై గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. మృతుడి జేబులో గంజాయి ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని, చేయి కోసుకున్న మనిషి నిలకడగా ఎలా ఉరి వేసుకోగలుగుతాడని సందేహాలు వ్యక్తం అయ్యాయి. యువకుడి మరణం వెనుక అధికార పార్టీ నాయకుల వేధింపులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఇది కాస్త వైసీపీ, టీడీపీ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యింది.

ఏం జరిగిందంటే….

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొప్పిగుంటకు చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావు, సీత దంపతులు ఉపాధి కోసం పదేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి స్థిరపడ్డారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్యామ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌‌ కోర్సు చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.

మూడు నెలల క్రితం కొత్తపేట మండలం ఖండ్రిగలోని అమ్మమ్మ చోడే మంగాయమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం తిరుపతి తిరిగి వెళ్లాడు. 15 రోజుల కిందట మళ్లీ ఖండ్రిగ గ్రామం వచ్చాడు. అమ్మమ్మ ఇంటి వద్ద విద్యుత్తు లేకపోవడంతో ఈ నెల 24న మోడేకుర్రులోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. పెద్దమ్మ తిరుపతి వెళ్లడంతో వారి ఇంట్లో శ్యామ్‌ ఒక్కడే ఉన్నాడు.

24వ తేదీన అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ నెల 25న పోలీసులకు సమాచారం అందింది. మృతుని అమ్మమ్మ మంగాయమ్మ ఫిర్యాదుతో ఏఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి, బంధువులకు అప్పగించారు.

మరోవైపు శ్యామ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హల్‌చల్‌ చేశాయి. దీంతో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం మృతుడి సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో 'మమ్మీ, డాడీ అయామ్‌ సారీ. నేనున్నా లేకపోయినా సంతోషంగా ఉండండి. నేను అందరి దృష్టిలో వేస్ట్‌. మళ్లీ జన్మ అంటూ ఉంటే మీకే పుట్టాలి. జాబ్‌ చేయడం నావల్ల కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మిస్‌ యూ మమ్మీ, డాడీ. సాయన్న మిస్‌ యూ అన్న. ఐలవ్‌యూ అన్నా. నా బిగ్గెస్ట్‌ బ్రదర్‌ నువ్వేనన్నా. మళ్లీ జన్మంటూ ఉంటే నీకు శిష్యుడిగా పుట్టాలి అన్నా. లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌ సాయన్నా' అని ఉంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్యామ్‌ సెల్ఫీ వీడియో తీసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా సెల్ఫీ వీడియోలో మరో వ్యక్తి మాటలు రికార్డవడం, ఆ వీడియో కూడా ముక్కలు ముక్కలుగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై తమకూ అనుమానాలున్నాయని, శ్యామ్‌తో ఎవరైనా చెప్పించారా? సొంతంగా చెప్పాడా అనేది పోలీసులే తేల్చాలని అతని తండ్రి శ్రీనివాసరావు అన్నారు. తమ కుమారుడికి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. ఉద్యోగం రాలేదని అంటే.. ఇంటికి వచ్చేయాలని చెబితే వచ్చేస్తానన్నాడన్నారు. తాను మాట్లాడిన తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త విన్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసులు మాత్రం మృతుడు శ్యామ్‌ బ్లేడ్‌తో చేతిమణికట్టు కోసుకుని, చీరతో ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు. అతని జేబులో బ్లేడ్‌, సెల్‌ఫోన్‌ దొరికాయని, వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని కొత్తపేట డిఎస్పీ వెంకట్ తెలిపారు. మరణంపై అనుమానాలు ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు.

మరోవైపు శ్యామ్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో వైకాపా నేతల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. లోతైన విచారణతోనే నిజాలు నిగ్గు తేలతాయని మంగళవారం ట్వీట్‌ చేశారు.

అటు అభిమాని మృతికి జూనియర్‌ ఎన్టీఆర్‌ సంతాపం తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయాడో తెలియకపోవడం మనసును కలచివేస్తోందని ట్వీట్‌ చేశారు. అధికారులు దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner