AP Summer Updates: ఇవేం ఎండలు బాబోయ్.. వడదెబ్బకు రాలుతున్న జనం
AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. ఎండలు అంతకంతకు పెరుగుతుండటంతో పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు అన్నిప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి.
AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8°C లు, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7°C లు, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13మండలాల్లో 46డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42°C -44°C ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఎస్‌డిఎంఏ డైరెక్టర్ వెల్లడించారు.
బుధవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మంగళవారం 40 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. క్షేత్రస్థాయిలో ఎండ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని అవి అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు..
అనకాపల్లి జిల్లాలో 2, గుంటూరులో 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు
మే 17 బుధవారం
• ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 18 గురువారం
• విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 19 శుక్రవారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 45°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 43°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఎండల ధాటికి కోస్తా భగ్గుమంటోంది...
ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. ఇంట్లో ఉన్నా భరించలేని ఉక్కపోత తప్పడం లేదు. వృద్ధులు, పసిపిల్లలు విలవిల్లాడుతున్నారు. వడదెబ్బతో రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10 మంది కన్నుమూశారు.
మంగళవారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 2 డిగ్రీలు పెరిగాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి, కనిగిరి మండలాల్లో రాత్రి 8గంటల తర్వాత కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకుపైనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.
బాపట్లలో సాధారణంకంటే 7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం. నరసాపురంలో 6.6, కాకినాడలో 6.1, మచిలీపట్నంలో 5.3, కావలి 4.8, ఒంగోలు 4 డిగ్రీల చొప్పున సాధారణంకంటే పెరిగాయి.
వడగాల్పులకు భయపడి జనాలు రోడ్లపైకి రావాలంటేనే హడలిపోతున్నారు. వేల మంది ప్రయాణీకుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మంగళవారం బోసిపోయి కనిపించింది. నాన్‌ఏసీ బస్సులన్నీ ఖాళీగా కనిపించాయి. తిరుపతి వెళ్లే బస్సులు అయితే ఎప్పుడూ కిక్కిరిసి సీట్లు దొరకని పరిస్థితి. అలాంటిది బస్సు డ్రైవర్లు ప్రయాణికుల కోసం పోటీపడి పిలిచే పరిస్థితి బస్టాండ్‌లో కనిపించింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లుసైతం నిర్మానుష్యంగా వెలవెలబోయి దర్శనమిచ్చాయి.
వడదెబ్బతో పదిమంది మృతి
వడదెబ్బతో ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో వి.ప్రసాదరావు (65), జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో పుట్టా శంకర్‌రెడ్డి (62) చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన రైతు పేడాడ సింహాచలం (63), తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు బంగ్లాతోట గిరిజన కాలనీవాసి, వ్యవసాయ కూలీ పైడి కస్తూరయ్య (50) వడదెబ్బతో కన్నుమూశారు.
బాపట్ల మండలం పిన్నిబోయినవారిపాలేనికి చెందిన కూలీ బి.రమణయ్య (55) చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు చలమాల కోటేశ్వరరావు (75), కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కూనపురెడ్డి చలపతి (103) ఎండ ధాటికి కన్నుమూశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం తాడపూడికి చెందిన కూలీ ఆర్.శ్రీనివాసరావు (40), తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు వాసి చెప్పుల సామేలు (55) కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు మండలం కౌతవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి.శివనాగరాజు (45) మృతిచెందారు.