Pawan Movie Shooting: సెట్స్‌పైకి పవన్ కళ్యాణ్‌ హరిహరవీరమల్లు..మంగళగిరిలో షూటింగ్..మార్చి 28న విడుదల-pawan kalyan on the sets harihara veeramallu shooting in mangalagiri released on march 28 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Movie Shooting: సెట్స్‌పైకి పవన్ కళ్యాణ్‌ హరిహరవీరమల్లు..మంగళగిరిలో షూటింగ్..మార్చి 28న విడుదల

Pawan Movie Shooting: సెట్స్‌పైకి పవన్ కళ్యాణ్‌ హరిహరవీరమల్లు..మంగళగిరిలో షూటింగ్..మార్చి 28న విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 24, 2024 02:26 PM IST

Pawan Movie Shooting: ఎన్నికల ప్రచారం, అధికార బాధ్యతలతో షూటింగ్‌ నిలిచిపోయిన పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ వైపు అధికారిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నా పవన్ కళ్యాణ్‌ ప్రొడ్యూసర్లకు డేట్లు కేటాయించి షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

మళ్లీ సెట్స్‌పైకి హ‍రిహర వీరమల్లు చిత్రం, మంగళగిరిలో షూటింగ్ ప్రారంభం
మళ్లీ సెట్స్‌పైకి హ‍రిహర వీరమల్లు చిత్రం, మంగళగిరిలో షూటింగ్ ప్రారంభం

Pawan Movie Shooting: పవన్ కళ్యాణ్‌ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తే మూవీ అప్డేట్‌ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం, ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా తీరిక లేని బాధ్యతల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గత సోమవారం నుంచి హరిహరవీరమల్లు సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత ఏఎం రత్నం చేసిన ట్వీట్‌‌తో షూటింగ్‌ ప్రారంభమైనట్టు స్పష్టత వచ్చింది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్‌ మంగళగిరిలోనే ఉంటున్నారు.

లోకేషన్‌ అక్కడే…

జనసేన పార్టీ కార్యాలయం సమీపంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఎల్‌ఈపిఎల్‌ అపార్ట్‌మెంట్- ఎయిమ్స్‌ ప్రాంగనానికి వెనుక ఏపీఎస్పీ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన సెట్లలో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. షూటింగ్‌‌కు వెళ్లడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని సైతం పవన్ కళ్యాణ్‌ కొద్ది రోజుల క్రితం ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.

పంచాయితీరాజ్‌, అటవీ శాఖ మంత్రిగా ఇరిగేషన్‌ క్యాంప్ ఆఫీస్‌ను కేటాయించినా కొద్దిరోజుల క్రితం దానిని ఖాళీ చేసి మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. విజయవాడ-మంగళగిరి మధ‌్య రాకపోకలు, విఐపి ప్రోటోకాల్‌తో సమయం వృధా అవుతుందని భావించడంతోనే ఆయన సొంతింటికి మకాం మార్చినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లారనే వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సుదీర్ఘ విరామం తర్వాత, రాజకీయ కమిట్‌మెంట్‌ నేపథ్యంలో తప్పనిసరిగా విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ గత సోమవారం ఎపిక్ పీరియాడికల్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు పార్ట్ వన్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్‌, ఏపీఎస్పీ బెటాలియన్‌ ప్రాంగణాన్ని అనుకుని అటవీ ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ మ్యాన్ నిక్ పావెల్ ప్రత్యేకంగా 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టంట్ సన్నివేశాలకు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ప్రస్తుతం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత సినిమా దర్శకుడు క్రిష్‌ సారథ్యం వహించారు. చిత్ర నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడంతో ఆయన తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.

మార్చి 28న సినిమా విడుదల..

మరోవైపు హరిహర వీరమల్ల చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని మార్చి 28, 2025 అని ప్రకటించారు, పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా సినిమా షూటింగ్ మరియు డిప్యూటీ ముఖ్యమంత్రిగా భిన్నమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో షూటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది.

లెజెండరీ డిజైనర్ తోట తరణి పర్యవేక్షణలో, ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ప్రొడక్షన్ టీం షూటింగ్ కోసం భారీ సెట్‌ను నిర్మించింది. ఈ సన్నివేశాలలో 400 మంది స్టంట్‌మెన్‌తో పాటు అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు.

హరి హర వీర మల్లు పార్ట్ 1: కత్తి వర్సెస్ స్పిరిట్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్ మరియు బాబీ డియోల్ కూడా సమిష్టి తారాగణంలో భాగం కాగా, నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మరియు VFX సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఉన్నారు మరియు ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రఖ్యాత ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి స్వరపరిచారు.హరి హర వీర మల్లు పార్ట్-1 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్-ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

సోమవారం ఉదయం 7 గంటలకు షూటింగ్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన శాఖలో సాధారణ బదిలీలపై చర్చించారు.

హరి హర వీర మల్లు పార్ట్ 1 కాకుండా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'OG' మరియు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే మరో రెండు సినిమాలు మే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్మాణంలోకి వచ్చాయి.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కొద్ది నెలల విరామం తీసుకున్నారు. ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు నెలల పాటు అమరావతిలోనే ఉండి కేవలం ప్రభుత్వ పనులపైనే దృష్టి సారించారు.

ఉప ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, మరియు సైన్స్ & టెక్నాలజీ శాఖలను కలిగి ఉన్నారు. మిగిలిన రెండు సినిమాల చిత్రీకరణను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని, అయితే రాజకీయాలపై సమానంగా దృష్టి సారించడం వల్ల వెంటనే కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేయకపోవచ్చునని సమాచారం. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడంపై అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.