AP Cabinet | పేరొక్కటే దక్కింది...!
మంత్రి వర్గ విస్తరణలో ఎన్టీఆర్ జిల్లాకు చోటుదక్కలేదు. బలమైన రాజకీయ ప్రాబల్యం ఉన్న సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ తో పాటు పలువురు సీనియర్ నాయకులకు నిరాశే మిగిలింది.
మంత్రి వర్గంలో స్థానమే లేని ఎనిమిది జిల్లాల్లో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఒకటి... 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో విజయవాడ తూర్పు మినహా అన్ని స్థానాల్లో వైసీపీ గెలించింది. విజయవాడ నగరంలోని రెండు నియోజకవర్గాలతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజక వర్గాలు వైసీపీకి దక్కాయి. ఎస్సీ కోటాలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, కమ్మ సామాజిక వర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ చివరి వరకు ప్రయత్నాలు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ కోటాలో పదవి ఆశించినా ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్‌లో మంత్రి వెల్లంపల్లికి స్థానం దక్కింది. ప్రస్తుతం గల్లంతైంది. వెల్లంపల్లి ఒక్కడికే కాదు మొత్తం ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు.
ఆశలపై నీళ్లు....
తాజా మంత్రి వర్గ విస్తరణలో తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని భావించిన వారిలో కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా నుంచి సామినేని ఉదయభాను పేర్లు గట్టిగా వినిపించాయి. పార్థసారథి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి ఎంపీగా పనిచేశారు. జిల్లాలో రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. 2004, 2009, 2019లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని బలంగా నమ్మారు. 2014లో ఇష్టం లేకున్నా మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. బీసీ కోటాలో యాదవ సామాజిక వర్గం నుంచి పార్థసారథి, ఆయన వియ్యంకుడు బుర్రా మధుసూదన్ యాదవ్‌లలో ఎవరో ఒకరికి పదవిని ఇస్తారని భావించారు. అయితే ఇద్దరికి పదవులు దక్కలేదు. సీనియర్ నేతగా మంత్రి పదవి ఖాయమని భావించినా రాకపోవడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. పార్థసారథికి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు విజయవాడలో ఆందోళనకు దిగారు. తన సామర్థ్యాన్ని జగన్ గుర్తించ లేదేమోనని నిరుత్సాహాన్ని ప్రకటించారు. వైఎస్సార్ తనను గుర్తించి మంత్రి పదవినిచ్చారని, ఎందుకిలా జరిగిందోనని కన్నీరు పెట్టుకున్నారు. అటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట ఉన్నారు. ఆయన కూడా తనకు మంత్రి పదవి వస్తుందని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గ జాబితాలో ఉదయభాను పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశారు. ఉదయభానుకు మద్దతుగా జగ్గయ్యపట మున్సిపాలిటీలో సామూహిక రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తనకు ప్రాతినిధ్యం లభిస్తుందని భావించినా చోటు దక్కకపోవడంతో ఉదయభాను కినుక వహించారు.
వ్యూహాత్మకమేనా.....
ఎన్టీఆర్ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కకపోవడానికి సామాజిక కారణాలే ప్రభావం చూపాయని జిల్లా నేతలు భావిస్తున్నారు. 2014లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వైసీపీ దక్కించుకోలేకపోయింది. విజయవాడ కేంద్రంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. మొత్తంగా ఆ వర్గాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా ప్రజలకు చూపే క్రమంలో అనుకూల వర్గాలను పదిలం చేసుకోడానికి ఎవరికి మంత్రి పదవి కేటాయించలేదని భావిస్తున్నారు. టీడీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును పదిలం చేసుకునే క్రమంలో ఇలాంటి ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్