Ganja Murders: విజయవాడలో ఆగని గంజాయి హత్యలు, ఒకే పీఎస్ పరిధిలో వరుస హత్యలు
Ganja Murders: విజయవాడలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు శివారు ప్రాంతాలను బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ప్రభావంతో రెండేళ్లలో ఏడు హత్యలు జరిగినా వాటికి అడ్డుకట్ట వేసేందుకు మాత్రం ప్రయత్నాలు జరగడం లేదు.
Ganja Murders: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో గంజాయి మత్తులో హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పక్షం రోజుల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. గత రెండేళ్లలో దాదాపు ఏడు హత్యలు ఒకే ప్రాంతంలో జరగడం స్థానికుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గంజాయి మూకలకు షెల్టర్ జోన్‌లుగా మారాయి.
వీటికి అడ్డు కట్ట వేయడానికి రైల్వే జిఆర్పీ, సివిల్ పోలీసులకు సరిహద్దు సమస్యలు తలెత్తడంతో ఇరు పక్షాలు ఆ ప్రాంతాలను పట్టించుకోవడం మానేశాయి. దీంతో నగరంలోకి గంజాయి రవాణా, అమ్మకాలకు కేంద్రాలుగా మారాయి. సోమవారం తెల్లవారుజామున గంజాయి మత్తులో ఓ వ్యక్తి భార్యను పీక కోసి హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు గంజాయి అంశాన్ని తొక్కి పెట్టి మద్యం మత్తులో హత్య జరిగినట్టు ప్రచారం చేవారు.
విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కంసాలిపేటలో షేక్ నగీనా అనే మహిళ హత్యకు గురైంది. మృతురాలి భర్త బాజీ పెయింటర్‌గా పనిచేసేవాడు. కొన్ని నెలలుగా స్థానిక యువకులతో కలిసి గంజాయికి అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణ పట్టించుకోక పోవడంతో మృతురాలు స్థానికంగా ఉన్న సమోసాలు తయారు చేసే పనిచేస్తోంది. రైళ్లలో సమోసాలు విక్రయించే వారికి వాటిని అందిస్తుంటారు.
మద్యం, గంజాయికి బానిసైన భర్త తరచూ వేధిస్తుండటంతో కొద్దిరోజులుగా సోదరి నివాసంలో ఉంటోంది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన భార్యను గంజాయి మత్తులో డబ్బు కోసం గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరికి గొడవ జరుగుతున్న సమయంలో బాధితురాలు సోదరికి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. ఆమె వచ్చే లోపు నిందితుడు భార్యను గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.
వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. గంజాయి మత్తులో ఆగడాలు జరుగుతున్నాయని స్థానికులు రెండు మూడేళ్లుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల ఒత్తిడి చేయడంతో పోలీసులు స్థానికుల నుంచి రెండున్నర లక్షలు రుపాయలు వసూలు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, ఆ తర్వాత వాటి మరమ్మతులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గంజాయి మూకలు రైల్వే యార్డుల్లో తిష్ట వేస్తున్నా పోలీసులు కనీసం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
రెండేళ్ల క్రితం రైల్వే యార్డుల్లో వరుస హత్యలు జరగడంతో అప్పటి సీపీ కాంతి రాణా తాతా నిత్యం యార్డుల్లో పహారా ఉండేలా సిబ్బందిని షిఫ్టుల వారిగా నియమించారు. కొద్ది నెలలకే అది అటకెక్కింది. నిఘా లేకపోవడంతో రైల్వే యార్డుల్లో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. మరోవైపు రైల్వే పోలీసులు తమకు తగినంత సిబ్బంది లేనందున రైల్వే యార్డులు, నివాస ప్రాంతాల్లో నిఘా పెట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ జిఆర్పీ స్టేషన్‌లో 70మంది సిబ్బందికి కేవలం 17మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.