APSRTC Driver Attacked : హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి, కావలిలో రెచ్చిపోయిన దుండగులు!-nellore kavali apsrtc driver attacked for honking by group of rowdy shetter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Driver Attacked : హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి, కావలిలో రెచ్చిపోయిన దుండగులు!

APSRTC Driver Attacked : హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి, కావలిలో రెచ్చిపోయిన దుండగులు!

Bandaru Satyaprasad HT Telugu
Oct 28, 2023 06:36 AM IST

APSRTC Driver Attacked : నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బైక్ అడ్డుగా ఉందని హారన్ కొట్టినందుకు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనను ఆర్టీసీ ఎండీ ఖండించారు.

కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి
కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

APSRTC Driver Attacked : నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న బైక్ ను తీయాలని ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు బస్సును ఫాలో అయ్యి, డ్రైవర్ ను బయటకు దింపి తీవ్రంగా కొట్టారు. దాడి ఘటనను వీడియో తీస్తున్న వారి ఫోన్లను సైతం లాక్కునేందుకు ప్రయత్నించారు. ఎవరోస్తారో చూస్తామంటూ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

అసలేం జరిగింది?

నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు వద్ద గురువారం సాయంత్రం ఈ దాడి జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడ వస్తోన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి విజయవాడకు బయలుదేరింది. దారిలో ఓ బైక్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో బస్సు డ్రైవర్ హారన్ మోగించారు. దీంతో ఆ బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు డ్రైవరుతో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు కల్పించుకుని బస్సును అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ విషయాన్ని బైక్ పై ఉన్న తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలిపాడు. మొత్తం 14 మంది వ్యక్తులు కారులో ఆ ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం బస్సు డ్రైవరును కిందకి లాగి తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ పై దాడికి పాల్పడిన దేవరకొండ సుధీర్‌, శివారెడ్డి, మల్లి, విల్సన్‌, కిరణ్‌లతో పాటు మొత్తం 10 మందిపై పలు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

దాడిని ఖండించిన ఆర్టీసీ ఎండీ

నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెంగుళూరు నుంచి విజయవాడ వస్తోన్న AP 16Z 0702 నెంబర్ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బి.ఆర్.సింగ్ పై TN C9 1612 నంబర్ గల కారు డ్రైవర్, కారులో వ్యక్తులు భౌతికంగా దాడి చేశారని పోలీసులు గుర్తించారన్నారు. నిందితులపై ipc సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్న పలువురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు కావలి పోలీసులు తెలిపారన్నారు. ప్రజల మధ్య విధులు నిర్వహించే ఆర్టీసీ కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.