MP Galla Jayadev : ఇక రాజకీయాలకు దూరం - గల్లా జయదేవ్ ప్రకటన
Galla Jayadev Quit From Politics: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
Galla Jayadev Quit From Politics: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్. ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన…. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చివరి మూడు సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేనని అన్నారు గల్లా జయదేవ్.. కానీ పార్లమెంట్‌లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని చెప్పారు. మా తాత వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం.. కానీ ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. వ్యాపారం, రాజకీయం రెండింటిని సమన్వయం చేసుకోలేకపోతున్నానని… ఈ క్రమంలోనే రాజకీయాలను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
"ప్రస్తుతం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. ఇకపై పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెడుతాను. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశాను. తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాను. వచ్చే ఎన్నికల్లో కూడా నిలబడితే గెలుస్తాను. కానీ పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాను. మళ్లీ అవకాశం వస్తే పోటీ చేస్తాను. మళ్లీ రాజకీయాల్లో వచ్చేందుకు రెడీగా ఉంటాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మంచిగా ఉంటే బాగుండేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాలను వదిలేస్తే మళ్లీ రావటం కొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి బ్రేక్ తీసుకొని మళ్లీ వస్తాను" అని అన్నారు గల్లా జయదేవ్.
వ్యాపారవేత్తలు రాజకీయాల్లో వస్తే స్వేచ్ఛంగా మాట్లాడే అవకాశం ఉండాలని... కానీ ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపై నిఘా పెడుతున్నారని కామెంట్స్ చేశారు గల్లా. ఇబ్బందులను చూస్తూ పార్లమెంట్ లో ప్రశ్నించలేకుండా ఉండలేనని... ఇలాంటి పరిస్థితుల్లోనే వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. గత రెండేళ్ల కిందట తన తండ్రి రిటైర్మెంట్ తీసుకుంటారని... ఆ బాధ్యతలు కూడా తానే చూడాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి బాధ్యతల మధ్య రాజకీయాల కొనసాగటం కుదరని నిర్ణయించుకున్నట్లు గల్లా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ తరపున రెండు సార్లు గుంటూరు నుంచి పోటీ గెలిచిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలగటంతో… వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తకిరంగా మారింది.