Ganja Cultivation: మావోయిస్టులనే తుదముట్టించారు, గంజాయి సాగును ఎందుకు అడ్డుకోలేరు.. ఏపీ పోలీసుల తీరుపై సందేహాలు
Ganja Cultivation: ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కేంద్రంగా ప్రాంతంలో వారి ఉనికి కూడా లేకుండా చేసిన ఏపీ పోలీసులు గంజాయి సాగు విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నారు.దేశం మొత్తానికి ఏపీ నుంచి గంజాయి సరఫరా అవుతోందన్న అపకీర్తిని మూటగట్టుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Ganja Cultivation: దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఊరికి గంజాయి వాడకం పాకింది. మద్యం ధరలు గణనీయంగా పెరగడంతో ప్రత్యామ్నాయ మత్తు పదార్ధాలకు యువత పెద్ద ఎత్తున అలవాటు పడ్డారు.
గుట్కా, ఖైనీల మాదిరి పాకెట్ల రూపంలో ప్రతి ఊళ్లలోకి గంజాయి వచ్చేసినా వాటిని అదుపు చేయడంలో వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఏపీలో గుట్కా, పాన్ మసాలా వినియోగంపై ఉన్న ఆంక్షల్ని తొలగించడంతో వాటి విక్రయాలు ఇప్పుడు యథేచ్ఛగా సాగుతున్నాయి. పైకి ప్యాకింగ్ పొగాకు తయారైన ఖైనీల మాదిరి ఉంటున్నా వాటి మాటున గంజాయిని కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో పండించే గంజాయికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. శీలావతి రకం గంజాయితో వచ్చే కిక్కుకు యువతను అలవాటు చేయడంలో దేశ వ్యాప్తంగా ముఠాలు విస్తరించాయి. గంజాయి సాగు కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కావడం లేదని పోలీసులు తరచూ చెబుతుంటారు. ఏపీలో ప్రతి ఊళ్లో గంజాయి వినియోగానికి అలవాటు పడిన గుంపులు నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రతి నేరం వెనుక గంజాయి వినియోగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటోంది.
మరోవైపు నక్సల్ ఉద్యమాన్ని, మావోయిస్టులను ఏజెన్సీ ప్రాంతాల నుంచి పూర్తిగా తరిమికొట్టడంలో విజయం సాధించామని చెబుతున్న ఆంధ్రా పోలీసులకు గంజాయి సాగును మాత్రం ఎందుకు అదుపు చేయలేకపోతున్నారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించదు.
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించిన దట్టమైన అరణ్యంలో గంజాయి సాగు జోరుగా సాగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో ఊరి పెద్దలే గంజాయి సాగుకు సారథ్యం వహిస్తుంటారు. గంజాయి విత్తనాలను నాటడం నుంచి వాటి మార్కెటింగ్ వరకు ఊరి పెద్దలే అన్నీ తామై చూసుకుంటారు. గంజాయి సాగు చేసే ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి కూడా వీల్లేనంద క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి.
ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య ఈ భూభాగాలు విస్తరించి ఉండటంతో చాలా సందర్భాల్లో సరిహద్దు సమస్యలు తలెత్తుతుంటాయి. ఒడిశా నుంచి తగినంత సహకారం లేకపోవడం కూడా గంజాయి సాగును కట్టడి చేయలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గంజాయి రవాణా చేయడానికి విస్తృతమైన నెట్‌వర్క్‌లు ఏర్పటు అయ్యాయి. ఇందులో వాటిని కట్టడి చేయాల్సిన యంత్రాంగాలు కూడా భాగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అప్పుడప్పుడు ఒకటీ అరా కేసుల్లో గంజాయి స్వాధీనాలు జరుగుతున్న ఫలితం మాత్రం ఉండట్లేదు. రైళ్లు, బస్సులు, కార్లు, మోటర్ సైకిళ్లు ఇలా ఒకటేమిటి వీలున్న ప్రతి మార్గంలో సరఫరా జరుగుతూనే ఉంది.
కఠిన చర్యలు అవసరం…
ఏజెన్సీలో గంజాయి సాగును అరికట్టడానికి, మొక్కల్ని ధ్వంసం చేయడానికి డ్రోన్ల సాయంతో క్రిమిసంహారకాలు, రసాయినాలు వెదజల్లాలని ప్రతిపాదించినట్టు విశాఖ రేంజ్ ఐజీగా పనిచేసిన ఎల్‌కేవీ.రంగారావు గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వం, ఉన్నతాధికారులు తన ప్రతిపాదనలకు అంగీకరించలేదని వివరించారు. క్రిమిసంహారక మందులు చల్లిన తర్వాత అదే గంజాయిని మార్కెట్లోకి తీసుకు వస్తే మరింత ప్రమాదకరమని అప్పటి డీజీపీ భావించారని చప్పారు. గంజాయి సాగును అడ్డుకోవడం పోలీస్ సిబ్బందికి సవాలుతో కూడుకున్న వ్యవహారమని, గంజాయి ద్వారా ఉత్పత్తి చేసే ఆయిల్ రవాణాను అడ్డుకోవడం అంత సులువు కాదని వివరించారు.
గంజాయి సాగు చేసే వారికి దేశం నలుమూలల నుంచి నెట్‌వర్క్ ఉంటుందని, అవన్నీ వేర్వేరుగా పనిచేస్తుండట వల్ల వాటిని అడ్డుకోవడం సవాలుతో కూడిన వ్యవహారమని చెప్పారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీలను గమనిస్తే ఈ సంగతి అర్థమైపోతుందని చెప్పారు. ఆ డబ్బు లావాదేవీలను అడ్డుకోవడం, నియంత్రించడం కష్టమని రంగారావు చెప్పారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి ఉపాధి ఉండదని వారికి గంజాయి సాగు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిందని వివరించారు. ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేసినా గంజాయితో పోలిస్తే వచ్చే ఆదాయం తక్కువ కావడంతో అటువైపే మొగ్గు చూపుతున్నారని చెప్పారు.
పదో వంతు కూడా పట్టుబడదు...
తరచూ పోలీసులు, నార్కోటిక్ బృందాలకు పట్టుబడే గంజాయి.. మొత్తం సరఫరా అయ్యే దానిలో పదో వంతు కూడా ఉండదని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా వ్యవహారాలపై అవగాహన ఉన్న వారు చెబుతారు. ఒడిశా సరిహద్దుల నుంచి జాతీయ రహదారుల మీదుగానే గంజాయి రవాణా అవుతుందని గంజాయి సాగు, వ్యాపారం చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా సమాచారం లీకైతే తప్ప ఆ వాహనాలు ఎప్పుడూ సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్లిపోతాయని చెబుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి విద్యా, ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే వారిని రవాణాకు వాడుకుంటున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. సమీప పట్టణాలకు వచ్చే యువతకు డబ్బు ఎరవేసి గంజాయి తరలిస్తున్న ఉదంతాలు కూడా వెలుగు చూవాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, ఉపాధి సమస్యలతో ఇలాంటి పనులకు యువత ముందుకొస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
అన్ని వ్యవస్థలకు భాగస్వామ్యం…
గంజాయి సాగు చేసే ప్రాంతాలకు సాధారణ ప్రజలు చేరుకోలేనంత దట్టమైన అడవుల్లో ఉన్నా వాటి నెట్వర్క్‌లో అన్ని రకాల వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. గంజాయిని సాగు చేసి పంట చేతికి వచ్చాక దానిని గమ్య స్థానానికి చేర్చే వరకు రకరకాల దశలను దాటాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థల్లో ఎక్సైజ్, పోలీసులు, రాజకీయ నాయకులకు కూడా భాగస్వామ్యం ఉంటుంది.
ఏజెన్సీ గ్రామాల్లో చిన్నాచితక నాయకులుగా చెలామణీ అయ్యే వారికి స్థానిక బడా నాయకులు అండగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా లాభాల్లో వాటాలు ముడుతుంటాయని, ఎప్పుడైనా చిక్కుల్లో పడినపుడు ఆ పెద్ద నాయకులు తమ వారిని కాపాడుకుంటూ ఉంటారు. దీంతో వారి ప్రమేయం ఎప్పుడు నేరుగా బయట పడదు.
ఏజెన్సీ నుంచి బయటకు వచ్చే ప్రతి వాహనానికి ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో రవాణా జరుగుతుందని, పోలీసుల తనిఖీలు ఉన్నా ముందుగానే స్మగ్లర్లను అప్రమత్తం చేసి వాటి నుంచి బయటపడే ప్రత్యేక వ్యవస్థలు గంజాయి సాగు ముఠాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. గంజాయి సాగును , వినియోగం, విక్రయలను సంపూర్ణంగా నిరోధించాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేసే అధికార యంత్రాగానికి పూర్తి భరోసాతో పాటు రాజకీయ జోక్యం లేని స్వేచ్ఛ కూడా అవసరం.