AP Special Flight : మణిపూర్ లో చిక్కుక్కున ఏపీ విద్యార్థులు, ప్రత్యేక విమానంలో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు-manipur tribal clashes ap student stuck in nit state government arranges special flight ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Special Flight : మణిపూర్ లో చిక్కుక్కున ఏపీ విద్యార్థులు, ప్రత్యేక విమానంలో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

AP Special Flight : మణిపూర్ లో చిక్కుక్కున ఏపీ విద్యార్థులు, ప్రత్యేక విమానంలో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2023 06:14 PM IST

AP Special Flight From Manipur : మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతోంది. గిరిజనతెగల మధ్య చెలరేగిన గొడవ హింసాత్మకంగా మారింది. దీంతో అక్కడ చిక్కుకున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

ఏపీ విద్యార్థుల తరలింపునకు ప్రత్యేక విమానం
ఏపీ విద్యార్థుల తరలింపునకు ప్రత్యేక విమానం (Twitter )

AP Special Flight From Manipur : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక అల్లర్లు కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తరలింపునకు ఏపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దిల్లీలోని ఏపీ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన అధికారులు... ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థుల తరలింపునకు సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అనుమతి తెలిపింది. ఈ స్పెషల్ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తారనే సమాచారంతో పాటు, ఎంత మందిని తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయానశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. దాదాపు 100 మందికి పైగా ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్టు అధికారులు గుర్తించారు.

157 మంది విద్యార్థులు గుర్తింపు

మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ లో చదువుతున్నట్టు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీలలో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్‌ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారిద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

విద్యార్థుల తరలింపునకు ప్రత్యేక విమానం

విద్యార్థులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌరవిమానయానశాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రైవేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు.

భయాందోళనలో విద్యార్థులు

మణిపుర్‌లో అల్లర్లు చెలరేగడంతో అక్కడ చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మణిపుర్‌ ఎన్‌ఐటీ సహా పలు విద్యాసంస్థల్లో చదువుకుంటున్నవారు హెల్ప్ లైన్ కు కాల్స్ చేసి రక్షించాలని కోరుతున్నారు. తమను ఏపీకి తరలించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మణిపూర్ ఎన్‌ఐటీ లో సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని, వారిలో 70 మంది వరకు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు అక్కడి విద్యార్థులు అంటున్నారు. గత మూడు రోజులుగా భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతున్నాయని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తామంతా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉన్నామన్నారు.

ఏపీ భవన్ లో హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మణిపూర్‌లోని ఏపీ విద్యార్థులకు సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు 011-23384016, 011-23387089 ఏర్పాటు చేశారు అధికారులు. విద్యార్థులకు సాయం అందించడానికి మణిపూర్ ప్రభుత్వం, స్థానిక అధికారులతో ఏపీ భవన్ అధికారులు సమన్వయం చేస్తున్నారు.

Whats_app_banner