Tirupati Accident: తిరుపతి జిల్లాలో లారీ బీభత్సం...కారు, ఆటోను ఢీకొన్న లారీ….. లారీ క్లీనర్ మృతి
Tirupati Accident: తిరుపతి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కారు, ఆటోను ఢీకొన్న లారీ ఆ తర్వాత కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
Tirupati Accident: తిరుపతి జిల్లాలో లారీ బీభత్సంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదట ఆటోను, ఆ తరువాత ఇన్నోవా కారు ఢీకొన్న లారీ, అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆటో రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లగా, ఇన్నోవా కారు 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరో ఐదుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటన తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. ముగ్గుపిండి లోడుతో మధ్యప్రదేశ్ నుంచి తిరుపతి వస్తున్న లారీ భాకరాపేట ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. అయితే లారీ శోభనాల రేవు వద్దకు వచ్చే సరికి కూరగాయల లోడుతో భాకరాపేట నుంచి తిరుపతి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. దీంతో ఆటో రహదారికి పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
లారీ మరికొంత దూరం వెళ్లాగానే అక్కడ ధర్మవరం నుంచి తిరుపతి వెళ్తున్న ఇన్నోవా కారును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు 50 అడుగుల లోయలోకి పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ధర్మవరానికి చెందిన ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయినే లారీ డ్రైవర్ నియంత్రణలోకి రాలేదు. అదే వేగంతో ముందుకు వెళ్లింది. లారీ చీకిమాకుల వంక కాలువ వద్దకు వచ్చే సరికి బోల్తా పడింది. దీంతో ఆ కాలువలోకి దూసుకెళ్లింది. లారీ నుజ్జునుజ్జు అయింది.
ఈ ప్రమాదంలో క్లీనర్ అల్తాఫ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ అబ్దుల్లా తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయ చర్యలు చేపట్టారు.
తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అబ్దుల్‌ను చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు, ఆటోలో ఉన్న ఇద్దరు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అల్తాఫ్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రగిరి సీఐ రామయ్య తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)