Loksatta JP : అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న జేపీ
Loksatta JP రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలుకలిసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని, రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం అమలుచేయాలన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని జయప్రకాష్ నారాయణ విమర్శించారు.
Loksatta JP అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ డిమాండ్ చేశారు. రాజధానిపై రాష్ట్రప్రభుత్వం తికమక నిర్ణయాలతో ప్రజలను మభ్య పెడుతోందని ఆరోపించారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇప్పటికైనా హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి అమలు చేయాలన్నారు.
దేశాన్ని పాలించిన తుగ్లక్ కూడా తరచు రాజధానులను మార్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి విజ్ఞత ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, లేదంటే ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి కన్నీళ్లు కారుస్తూనే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. అందరూ కలిసి గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అభివృద్ధి ఫలాలు అందేలా గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించారన్నారు.
విజయవాడలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పాలన గాడితప్పందని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు పెరగడంపై జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి పప్పు కూడు సరైన పద్ధతి కాదన్నారు. రేపటి భవిష్యత్తు కోసం పునాదులు వేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ముందుచూపు లేకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. కూర్చుని తింటే కొడలే తరిగిపోతాయని, ఎడా పెడా అప్పులు చేస్తే శ్రీలంకలా మారిపోతుందన్నారు. ఏపీలో అప్పులకు అంతు లేకుండా పోతోందని విమర్శించారు. పేదలకు సంక్షేమం కచ్చితంగా చేయాల్సిందేనని, సంక్షేమం ఒక్కటే అమలు చేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వంకతో అభివృద్ధిని విస్మరించవద్దని హితవు పలికారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోన్న మాటలు అబద్దమన్నారు. తాను ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, పిల్లలకు సులువుగా అర్థమయ్యే మాతృభాషలోనే బోధన చేయాలనేదే తన విధానమన్నారు.