Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ తేదీల్లో అమ్మకాలు బంద్!
Liquor Shops Close : గణేష్ నిమజ్జనం కారణంగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. వివిధ ప్రాంతాల్లో ఆయా రోజుల్లో మద్యం దుకాణాలు బంద్ చేస్తారు.
Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు, కల్లు దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. కర్నూలు జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు దుకాణాలు బంద్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, వెల్దుర్తిలో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు మందు షాపులు మూసివేయనున్నారు. ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో విక్రయాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కోలాహలంగా నిమజ్జనాలు
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత గణేష్ నిమజ్జనం వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా యువత, భక్తులు సందడిగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు చేపడుతున్నారు. వినాయక ప్రతిమలను ట్రాక్టర్లలో వీధుల్లో ఊరేగించి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. నిమజ్జనం కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఆత్మకూరులో సుమారు 31 వినాయక విగ్రహాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని గణనాథులను ఎర్రగూడూరు సమీపంలోని శ్రీశైలం కుడి కాల్వలో నిమజ్జనం చేశారు. నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చెరువులు, కాల్వల వద్ద యువత అత్యుత్సాహం వద్దని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నిమజ్జనంలో అపశృతి
గణేష్ నిమజ్జనం అంటే భక్తుల కోలాహలం, కేరింతలు కనిపిస్తాయి. పెద్ద సంఖ్యలో యువకులు వినాయక విగ్రహాలను ఊరేగిస్తూ... వేడుకగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఎంతో సంబరంగా చేసుకునే నిమజ్జనంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వేరు వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో పలు చోట్ల గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. కృష్ణగిరి మండలం కోయిలకొండలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేముందు ఊరేగిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తూ మురళీకృష్ణ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురంలో మరో ఘటన చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి రాజు అనే యువకుడు మృతి చెందాడు.