AP Parties Silent Mode: మౌనంగా ప్రధాన పార్టీలు..! భయమా..? వ్యూహమా..?
Rahul Gandhi's disqualification Issue: రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పలు పక్షాలు బీజేపీని ఖండిస్తే… మరికొన్ని పక్షాలు మద్దతుగా మాట్లాడుతున్నాయి. ఇంకొందరూ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే ఏపీలోని పరిస్థితి చూస్తే… గమ్మత్తుగా ఉంది.
AP Parties Silence on Rahul Gandhi's disqualification: రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం సంచలనంగా మారింది. వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ సభ సచివాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదీ కాస్త.... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అంటే... బీజేపీని ఏకిపారేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించింది. అయితే ఈ అంశంపై దేశంలోని పెద్ద, చిన్న పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఒకరు రాహుల్ కి మద్దతు ఇస్తే... మరొకరు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇంకొందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. ఈ తరహా చర్యలు సరికావంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో ఏపీలోని పార్టీల తీరు చూస్తే మాత్రం ఆసక్తికరంగా మారింది.
స్పందించని టీడీపీ...!
ఏపీ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయనే దాంట్లో ఏ మాత్రం డౌట్ ఉండదు. ఏపీ కేంద్రంగానే యాక్టివ్ గా ఉంటూ... ఢిల్లీలోని జాతీయ పార్టీలతో మైత్రిని కొనసాగిస్తూ తమ ప్లాన్స్ వర్కౌట్స్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో మాత్రం ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన వంటి పార్టీలు మాత్రం స్పందించటం లేదు. నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు చంద్రబాబు. ఏకంగా ఢిల్లీ యాత్రలు చేస్తూ... రాహుల్ గాంధీతో భేటీలు కూడా అయ్యారు. మోదీని తరిమికొట్టాలంటూ ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత... కాంగ్రెస్ విషయంలో సైలెన్స్ అయ్యారు చంద్రబాబు. అటువైపు చూసిన దాఖలు కూడా లేవు. అలాంటి తెలుగుదేశం... ప్రస్తుతం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తే కనీసం స్పందించలేదు. పార్టీ అధినేతగా చంద్రబాబుతో పాటు ముఖ్య నేతలు ఎవరూ కూడా... రియాక్ట్ అయిన పరిస్థితులు కనిపించలేదు. మద్దతుగా మాట్లాడితే... బీజేపీ దృష్టిలో మరోసారి టార్గెట్ అవుతామా..? లేక పట్టించుకోకపోవడమే బెటర్ అనుకోని రియాక్ట్ కాలేదా..? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. ఇప్పటికే ఓసారి కలిసి ఫెయిల్ అయ్యామనే భావన ఆ పార్టీలో ఉందా అనేది కూడా తెరపైకి వస్తోంది.
ఇక వైసీపీ విషయానికి వస్తే పెద్దగా చర్చించుకోవడానికి ఏం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే... కాంగ్రెస్ ను ఎదురించి బయటికి వచ్చిన జగన్... సొంతగానే పార్టీ పెట్టారు. ఏకంగా ఏపీలో భారీ మెజార్టీతో గెలిచారు. నాటి నుంచి కూడా కాంగ్రెస్ విషయంలో గుర్రుగానే ఉన్నారు జగన్. అసలు ఆపార్టీ గురించే మాట్లాడని పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీతో మాత్రం రిలేషన్స్ సాగిస్తున్నారు. వీలు చూసుకుని ఢిల్లీ పర్యటనలు చేస్తున్న జగన్... రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో జగన్ కానీ...వైసీపీ నేతలు కానీ స్పందించటం లేదు.
ఇక రాహుల్ గాంధీ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. చాలా ఏళ్లుగా పవన్ ... బీజేపీ డైరెక్షన్ లో పని చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంటే అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కామ్రేడ్ల విషయానికొస్తే రాహుల్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు. జయప్రకాశ్ నారాయణ్ వంటి వారు కూడా స్పందిస్తూ... వేటు సరికాదనే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం... రాహుల్ గాంధీకి సరైన శిక్షనే విధించారని చెబుతున్నారు.
ఇక తెలంగాణలో చూస్తే మాత్రం... పరిస్థితి ఏపీకి భిన్నంగా ఉంది. బీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు పార్టీలు స్పందించాయి. రాహుల్ కి మద్దతుగా మాట్లాడారు కేసీఆర్. బీజేపీపై ఓ రేంజ్ లోనే ఫైర్ అయ్యారు. షర్మిల కూడా బీజేపీ విధానం సరిగా లేదని... ఇలాంటి నిరంకుశ నిర్ణయాలు తీసుకోవటమేంటని ప్రశ్నించారు.మొత్తంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం... పలు కీలక అంశాలను తెరపైకి వస్తుంటే... రాజకీయ పార్టీల తీరు కూడా బయటపడుతున్నట్లు అర్థమవుతోంది.
సంబంధిత కథనం