Rahul Gandhi disqualification : అనర్హత వేటు ఎపిసోడ్‌తో 'రాహుల్ గాంధీ 2.0' సాధ్యమేనా?
Rahul Gandhi disqualification news : అనర్హత వేటు అన్నది రాహుల్ గాంధీకి ఓ వరం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాహుల్ గాంధీ.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, మోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు మంచి అవకాశం అని పలువురు భావిస్తున్నారు.
Rahul Gandhi disqualification news : 'రాహుల్ గాంధీ'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. లోక్‌సభలో అనర్హత వేటుతో ఈ కాంగ్రెస్ వారసుడు ఇప్పుడు వార్తలకెక్కారు. రాహుల్‌పై ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు ఊపందుకున్నాయి. తాజా పరిణామాలను చూస్తే.. రాహుల్‌ను బీజేపీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే.. ఈ పరిస్థితులు రాహుల్‌కే మంచిదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇంతకాలం తనకు ఉన్న 'పప్పు' పేరును తొలగించుకునేందుకు, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు.. అటు రాహుల్‌కు, ఇటు కాంగ్రెస్‌కు ఇదే మంచి అవకాశం అని పలువురు భావిస్తున్నారు. మరి ఇది సాధ్యమేనా?
బీజేపీ అస్త్రం.. ‘పప్పు’!
దేశ రాజకీయాల్లో 'పప్పు' అన్న పేరు వినపడగానే ముందుగా గుర్తొచ్చే పేరు రాహుల్ గాంధీ. సొంత తప్పిదాల కన్నా.. బీజేపీ విజయవంతంగా చేసిన ప్రచారాల వల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది! ప్రధాని మోదీని ఢీకొట్టలేక అనేకమార్లు రాహుల్ గాంధీ చతికిలపడగా.. అదే అదునుగా భావించిన బీజేపీ ఐటీ సెల్ ఆయనపై 'పప్పు' అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఫేక్ న్యూస్, మీమ్స్, జోక్స్, ట్రోల్స్.. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న అన్నింటినీ వాడుకుని, కాంగ్రెస్ వారసుడిని ఇరకాటంలో పెట్టింది. బీజేపీ ప్రయత్నం ఎంతలా సక్సెస్ అయ్యిందంటే.. వారసత్వ, కాంగ్రెస్ రాజకీయాలు గిట్టని దేశంలోని చాలా మంది.. రాహుల్ గాంధీని ఇప్పటికీ పప్పుగానే పరిగణిస్తున్నారు!
Rahul Gandhi latest news : కానీ ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ విషయంలో కమలదళం హైకమాండ్ ఆలోచనలు మారినట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు రాహుల్‌ను 'పప్పు'గా భావించిన వారు.. ఇప్పుడు ఆయనపై సీరియస్‌గా ఫోకస్ చేసినట్టు అర్థమవుతోంది. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణ.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడటం, 24 గంటల వ్యవధిలోనే ఆయన తన ఎంపీ సీటు కోల్పోవడం.. అన్ని చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ మాటల్లో చెప్పాలంటే.. రాహుల్ గాంధీ గొంతును అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుండటం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇవన్నీ చూస్తుంటే.. బీజేపీకి రాహుల్ గాంధీ ఇక ఏమాత్రం 'పప్పు' కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ 2.0 సాధ్యమేనా?
Rahul Gandhi defamation case : 'పప్పు' అన్న ముద్ర.. రాహుల్ గాంధీని చాలా కాలం నుంచి వెంటాడుతూనే ఉంది. దానిని చెరిపేసేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అయితే.. ఈ కాంగ్రెస్ వారసుడు మునుపటి కన్నా ఎంతో సీరియస్‌గా, ధృఢంగా కనిపిస్తున్నారు. ప్రజల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వార్తల్లో ఎక్కువ నిలుస్తున్నారు. మోదీ, అదానీ విషయంలో బీజేపీకి ధీటుగా నిలబడుతున్నారు. తనపై అనర్హత వేటు పడిన అనంతరం ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో "క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్‌ని కాదు. నా పేరు గాంధీ, గాంధీలు క్షమాపణలు చెప్పరు" అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా వార్తల్లో హెడ్‌లైన్స్‌కి ఎక్కాయి.
ఈ పరిణామాల మధ్య కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీడియా సమావేశంలో ఉన్నంత గంభీరంగా, ధైర్యంగానే రానున్న రోజుల్లో రాహుల్ ఉంటారా? 2024 సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. తాను పప్పు కాదు అని నిరూపించుకోగలరా?
Rahul Gandhi defamation case live : ఇంత కాలం జరిగినవి పక్కన పెడితే.. ఇటీవలి పరిణామాలు రాహుల్ గాంధీకి ఒకింత మంచి చేసేవే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదానీపై ప్రశ్నిస్తున్న వారిని అధికారపక్షం టార్గెట్ చేసి మరీ వెంటాడుతోందన్న వాదనను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తే.. కమలదళానికి ఇక్కట్లు తప్పవు! ఈ విషయంపై విపక్షాలను ఏకథాటిపై నడిపిస్తే.. మోదీపై పోరులో కాంగ్రెస్ అతిపెద్ద విజయం సాధించినట్టే. ఇదంతా రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంది! ఒక్క మాటలో చెప్పాలంటే.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాహుల్ గాంధీ తనని తాను కొత్త ఆవిష్కరించుకోవడం ఇప్పుడు అత్యావసరం. మరి రాహుల్ 2.0ని దేశప్రజలు చూస్తారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.
అంత ఈజీ కాదు.. కానీ!
అయితే.. రాహుల్ 2.0 అన్నది అంత సులభమైన టాస్క్ కాదు. బీజేపీ కారణంగా ఇప్పటికీ చాలా మంది మిడిల్ క్లాస్ ప్రజలు రాహుల్‌ని పప్పుగాను, కాంగ్రెస్‌ను వారసత్వ పార్టీగాను చూస్తున్నారు. కమలదళం పన్నిన ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అలా అని కాంగ్రెస్, రాహుల్‌లు చేతులెత్తేయాల్సినంత కష్టం కూడా కాదు! రాహుల్ గాంధీపై పడిన అనర్హత వేటును కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది. 'బీజేపీ అధికార దుర్వినియోగం' నినాదంతో ప్రజల్లోకి వెళ్లితే కాస్త సక్సెస్ సాధించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Rahul Gandhi MP status : అయితే ఈ పూర్తి ఎపిసోడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి కార్యకర్తలు, పార్టీ సభ్యులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పార్టీలోని పేరుమోసిన లీడర్గే ఇలా జరిగితే.. తమ పరిస్థితేంటని ఆలోచిస్తున్నారు. విపక్షాలు సైతం.. కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పరచుకునేందుకు ఒకింత ఆలోచిస్తున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారే ముందే.. కాంగ్రెస్ మేలుకోవాలి. లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్లాలి.
రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయం అంటూ కాంగ్రెస్ ప్రచారాలు చేయకుండా.. అనర్హత వేటును అస్త్రంగా ఉపయోగించుకుని బీజేపీకి అత్యంత బలమైన 'జాతీయవాదం'పై కొట్టాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ కొట్టే దెబ్బకు దేశంలోని విపక్షాలు ఏకమవ్వాలని, అదానీ- మోదీ సంబంధాలపై ప్రశ్నల తీవ్రత మరింత పెరగాలని చెబుతున్నారు. అదానీ స్కామ్‌ను ప్రశ్నిస్తే.. దేశానికి వ్యతిరేకంగా నిలబడినట్టు కాదని నిరూపించాలని స్పష్టం చేస్తున్నారు.
అంతా రాహుల్ చేతుల్లోనే..!
Congress protest Rahul Gandhi : ఇవన్నీ జరగాలంటే ఓ మార్గం ఉంది. అదానీ వ్యవహారంపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించే విధంగా ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్ సెషన్ జరగకపోతే మూకుమ్మడి రాజకీయాలకు దిగుతామని హెచ్చరించాలి. రియాలిటీలో ఇది జరగడం కష్టమే అనిపించినా.. ఈ హెచ్చరికలతో బీజేపీ జాతీయవాదాన్ని దెబ్బతీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా.. బీజేపీ అపర చాణుక్యులు.. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు, విపక్షాలకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాహుల్ గాంధీ.. ప్రజల్లో మోదీకి ఉన్న ఇమేజ్ను దెబ్బతీయగలరా? తనపై ఉన్న పప్పు బిరుదుని తొలగించుకోగలరా? తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోగలరా? విపక్షాలను ఏకథాటిపైకి తీసుకురాగలరా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న కాలంలో తెలిసిపోతుంది.
సంబంధిత కథనం