CBI| వివేకా హత్యకు వ్యూహకర్త అవినాశ్ రెడ్డి.. ఛార్జిషీటులో సంచలన వాస్తవాలు..?-key facts in cbi charge sheet over ys vivekanada reddy murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbi| వివేకా హత్యకు వ్యూహకర్త అవినాశ్ రెడ్డి.. ఛార్జిషీటులో సంచలన వాస్తవాలు..?

CBI| వివేకా హత్యకు వ్యూహకర్త అవినాశ్ రెడ్డి.. ఛార్జిషీటులో సంచలన వాస్తవాలు..?

HT Telugu Desk HT Telugu
Feb 15, 2022 12:28 PM IST

కడప ఎంపీ టికెట్ తనకు లేదా వైఎస్ షర్మిలకు, అదీ కాకపోతే వైఎస్ విజయమ్మకు దక్కాలని వివేకానంద రెడ్డి గట్టిగా భావించారు. అంతేకానీ వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఆయన అనుకున్నారని సీబీఐ ఛార్జి షీటులో పేర్కొంది.

<p>వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో అవినాశ్ రెడ్డి&nbsp;</p>
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో అవినాశ్ రెడ్డి (Facebbok)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మూడేళ్లయినా ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలో దిగి విచారణ జరుపుతోంది. అయితే సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీటులోని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వివేక హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉందని సీబీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిల ప్రమేయం ఉందని అభియోగపాత్రల్లో వెలుగు చూశాయి.

అవినాశ్ రెడ్డి పాత్ర ఏంటి..

‘కడప ఎంపీ టికెట్ తనకు లేదా వైఎస్ షర్మిలకు, అదీ కాకపోతే వైఎస్ విజయమ్మకు దక్కాలని వివేకానంద రెడ్డి గట్టిగా భావించారు. అంతేకానీ వైఎస్ అవినాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఆయన అనుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉంది. ఈ కోణంలో దర్యాప్తు సాగుతోంది..’ అని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా వివేకా హత్య తర్వాత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆ ఆధారాలను ధ్వంసం చేశారని తెలిపినట్లు సమాచారం.

2019 మార్చి 14 అర్ధారాతి తర్వాత వివేకానందరెడ్డి మరణించినట్లు సీబీఐ పేర్కొంది. తెల్లవారుజామున ఉదయం 06.25 గంటలకు వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రతాపర రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నప్పటికీ గుండెపోటుతో మరణించారని మీడియాకు చెప్పారు. అంతేకాకుండా కుమార్తె, అల్లుడు రాకుండానే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

నెల ముందే ప్రణాళిక..

పక్కా ప్రణాళిక ప్రకారమే వివేక హత్య జరిగినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఆయనకు సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, గజ్జల యాదవ్ ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ షేక్ దస్తగిరి ఈ కుట్రకు వ్యూహాన్ని రచించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 10న హత్యకు ప్రణాళిక పన్నారు. ఇందుకు గాను మొత్తం రూ. 40 కోట్లకు ఒప్పందం జరిగిందని తెలిపింది. 

హత్య చేయడానికి కారణాలు..

‘వివేకానందరెడ్డి వైకాపాలో చేరడం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇష్టం లేదు. వైసీపీలోకి వివేకా చేరడానికంటే ముందే కడప జిల్లాలో శివశంకర్ రెడ్డి కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్ధతు ఇవ్వలేదు. ఓటమి పాలైన వివేకా.. శివశంకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకంటే ముందే వైకాపాలో చేరితే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించిన శివశంకర్ రెడ్డి ఆయన చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు’ అని సీబీఐ తెలిపింది.

‘బెంగళూరులో భూ సెటిల్మెంట్ చేసినందుకు వివేకా రూ. 8 కోట్ల ఆశించారు. అందులో తనకు కూడా వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. దీంతో ఆయనపై గంగిరెడ్డి వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. తనను చిన్నచూపు చూశారని గజ్జల ఉమాశంకర్ రెడ్డి , తనను డ్రైవర్‌గా తీసేశారని షేక్ దస్తగిరి వివేకాపై పగ పెంచుకున్నారు’ అని సీబీఐ వివరించింది.

ఆధారాల ధ్వంసం..

హత్య జరిగిన రోజు రాత్రి ఇంటి ముందు నుంచి ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అంతేకాకుండా పడకగది, బాత్రూంలో ఉన్న రక్తపు మరకలను శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి శుభ్రం చేయించారు. పనిమనిషితో ఆ మరకలను తొలగింపజేసి సాక్ష్యాధారాలను నాశనం చేశారు. ఈ విషయాలను ఫిర్యాదులో చెప్పకుడా దాచిపెట్టారు. 

ఎర్ర గంగిరెడ్డి దిశా నిర్దేశంతో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి హత్య ప్రణాళిక అమలు చేశారు. హత్యకు కుట్ర రూపొందించిన తర్వాత దస్తగిరికి సునీల్ కోటి రూపాయలు ఇచ్చారు. ఇందులో రూ. 40.70 లక్షలను దస్తగిరి మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచగా.. వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ పేర్కొంది.

చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు..

వివేకానందరెడ్డి హత్య నేరాన్ని తనపై వేసుకుని, చంపినట్లు అంగీకరిస్తే రూ. 10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి.. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తికి ఆఫర్ చేశారు. అంతేకాకుండా దస్తగిరిని సీబీఐ విచారణకు రమ్మని నోటీసులిచ్చిందని తెలుసుకుని.. అతడిని ప్రలోభానికి గురిచేశారని, సీబీఐ వద్ద పేర్లు చెప్పకుండా ఉంటే తన లైఫ్ సెటిల్ చేస్తామని చెప్పినట్లు పేర్కొంది. అంతేకాకుండా దస్తగిరిని ఓ కంట కనిపెట్టేందుకు భరత్ యాదవ్‌ను శివశంకర్ రెడ్డి పంపారని, అంతేకాకుండా పేర్ల బయటపెట్టకుండా ఉండాలని వాచ్‌మెన్ రంగన్నను గంగిరెడ్డి బెదిరించారని సీబీఐ ప్రస్తావించింది.

Whats_app_banner

సంబంధిత కథనం