Higher Education Admissions :రికార్డు స్థాయిలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు
Higher Education Admissions ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుల్లో కొద్ది మంది మాత్రమే ఏ కోర్సులో చేరకుండా ఉండిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మరోవైపు ఏపీలో బీఈడీ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల తనిఖీల తర్వాతే ప్రవేశాలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Higher Education Admissions ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స‌్థాయిలో అడ్మిషన్లు జరిగాయని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 93.38 శాతం మంది ఉన్నత చదువులకు ప్రవేశాలు పొందారన్నారు.
నాణ్యతా ప్రమాణాల నిర్దారణకు బిఇడి కాలేజీల్లో తనిఖీలు చేపడుతున్నామని, త్వరలోనే బిఇడి కోర్సుల ప్రవేశాలు నిర్వహిస్తామని బొత్స ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనట్లు రికార్డు స్థాయిలో విద్యార్ధుల అడ్మిషన్లు జరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఉత్తీర్ణులైన 3,37,987 మంది విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది విద్యార్ధులు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని చెప్పారు. డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.హేమచంద్రా రెడ్డి లతో విజయవాడలో సమీక్ష జరిపారు.
గతంలో కంటే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ప్రస్తుత విద్యా సంత్సరంలో ఉత్తీర్ణులైన 3,37,987 మంది విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది, మొత్తం ఉత్తీర్ణుల్లో 93.38 శాతం విద్యార్ధులు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని చెప్పారు.ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో కేవలం 22 వేల పైచిలుకు విద్యార్దులు మాత్రమే ఉన్నత చదువుల్లో ప్రవేశం పొందలేదన్నారు.
కోవిడ్ కు ముందు 2018-19 లో 4,07,704 మంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయితే వారిలో కేవలం 3,19,891, మంది మాత్రమే ఉన్నత విద్యలో అడ్మిషన్లు పొందారని చెప్పారు. ఆ ఏడాది 79.63 శాతం విద్యార్ధులు అడ్మిషన్లు పొందారని, 2019-20 లో 3,97,494 మంది విద్యార్ధులకు గాను 3,50,540 మంది (88.19 శాతం) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందారన్నారు.
విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇంతవరకు ఇంజనీరింగ్ కోర్సుల్లో 1.20 లక్షల మంది, ఫార్మసీ లో 12 వేల మంది, వ్యవసాయం- ఆక్వా కల్చర్ లో 5 వేల మంది తోపాటు, మెడికల్ మరియు నర్సింగ్ కోర్సుల్లో 15 వేల మంది అడ్మిషన్లు పొందారని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే వివిధ డిగ్రీ కోర్సుల్లో 1.48 లక్షల మంది , ఐఐఐటి, ఎన్ఐటి, వంటి కోర్సుల్లో 5600 మంది, ఇతర రాష్ట్రాల్లో మరో 10 వేల మంది ప్రవేశాలు పొందారన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో అత్యధిక శాతం పై చదువులకు ప్రవేశాలు పొందడం మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు.
బిఇడి కళాశాలల్లో ప్రమాణాలకే పెద్ద పీట….
రాష్ట్రంలోని విద్యార్ధులకు నాణ్యతో కూడిన విద్యా బోధన అందేలా చూడాలన్న క్రమంలో, బిఇడి కళాశాలల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీల విసిలకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో NCTE ప్రమాణాలను అమలు చేస్తున్నారా లేదా అన్న అంశం పరిశీలించిన తరువాతనే బిఇడి కళాశాలల గుర్తింపు రెన్యువల్ చేయాలని ఆదేశించారు.
బిఇడి కళాశాలల్లోని ప్రమాణాలపై పలు ఫిర్యాదులు వస్తున్న దరిమిలా, విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని మంత్రి అన్నారు. వీలైనంత త్వరలో ఈ తనిఖీలను పూర్తి చేసి, బిఇడి కోర్సుల ప్రవేశాలను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తనిఖీల తర్వాతే ఏపీలో బీఈడీ కళాశాలల గుర్తింపును రెన్యువల్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో రికార్డు స్థాయిలో ప్రవేశాలు పెరిగాయన్నారు.