HC On Retirement Age: కార్పొరేషన్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు చెల్లదన్న హైకోర్టు
HC On Retirement Age: రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని పెంచడంపై హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్ల వయో పరిమితి పెంపు సరికాదని స్పష్టం చేసింది.
HC On Retirement Age: రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయో పరిమితి పెంచాలని ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం కొట్టేసింది. కార్పొరేషన్ ఉద్యోగుల వయసును 62ఏళ్లకు పెంచాలని ఆదేశించడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పిటిషనర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచాలని ఏపీ హైకోర్టు సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు సర్వీసు రూల్స్ వేర్వేరుగా ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ 1984 నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ప్రత్యేక నియమనిబంధనలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ముడిపడి ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలు అందుతాయని, కార్పొరేషన్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించదని స్పష్టం చేసింది.
సింగల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ేపీ విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీతో పాటు పాటశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు జడ్జిలు డివిఎస్ సోమయాజులు, వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఏపీఈడబ్ల్యూఐడీసీ ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పొడిగించాలని కోరుతూ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగల్ జడ్జి కోర్టు ఉద్యోగులు పదవీ విరమణ వయసు పెంపుకు అర్హులేనని గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీఈడబ్ల్యూఐడీసీ సంస్థ ఎండీలు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. కార్పొరేషన్ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తారని వారికి 62ఏళ్ల వయో పరిమితి వర్తింప చేయాలని ఉద్యోగులు కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 62ఏళ్ల వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్ ఉద్యోగులు ప్రయోజనాలను పొందలేరని తీర్పు వెలువరించింది. కార్పొరేషన్లకు సొంత సర్వీస్ రూల్స్ ఉంటాయని, వాటికి ఏకీకృత నిబంధనలు ఉండవని తేల్చి చెప్పింది. కార్పొరేషన్లే ఉద్యోగులకు జీతాలను చెల్లిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయో పరిమితి పెంపును కోరలేరని హైకోర్టు తేల్చి చెప్పింది.