AP Weather Update: నేడు, రేపు ఏపీలో వానలే వానలు, రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు
AP Weather Update: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఇప్పటి వరకు వానలు కురవలేదు. ఓ వైపు జలాశయాల్లో నీరు లేకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ, వానలు సంతోషం కలిగిస్తున్నాయి.
AP Weather Update: ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఐఎండి అంచనాల ప్రకారం పశ్చిమమధ్య బంగాళాఖాతం ఆనుకుని కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర మంతటా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళ,బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
సముద్ర మట్టానిిక 5.8కి.మీ ఎత్తులో కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, గంగా, పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసి పోయినట్టు ఐఎండి పేర్కొంది. గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా మీద సముద్ర మట్టం నుంచి 5.8కి.మీ వరకు విస్తరించిన ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి అమరావతి కేంద్రం పేర్కొంది.
భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ఐఎండి అంచనాల ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
సోమవారం రాష్ట్రంలోని పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.