Rains In AP live Updates : తుంగభద్రకు భారీ వరద - 20 గేట్లు ఎత్తివేత
- రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, కృష్ణా,గుంటూరులో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తున్నాయి.
Wed, 13 Jul 202210:50 AM IST
పోలవరం గేట్లు ఎత్తిన అధికారులు
పోలవరం వరద నీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ మొదటి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్ వే లోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. గోదావరికి ఆకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా పోలవరంలో హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా పని చేస్తున్నాయి. అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి.
Wed, 13 Jul 202206:03 AM IST
Tungabhadra జలాశయం 20 గేట్లు ఎత్తివేత
తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం ఎగువ కర్ణాటకలోని మల్నాడు ప్రాంతమైన సీమొగ్గ, ఆరావళి పర్వతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం ఉప్పొంగుతోంది. వరదప్రవాహం అధికం కావడంతో అధికారులు జలాశయం 20 గేట్లు ఎత్తివేసి 39,243 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో: 90,664 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో: 39,243 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1631.48 అడుగులు ఉంది.
Wed, 13 Jul 202203:52 AM IST
విలీన మండలాల్లో వరద ఉద్ధృతి..
ఏలూరు జిల్లాలోని విలీన మండలాల్లో మంగళవారం సాయంత్రం వరకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధికారికంగానే 3000 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి.
Wed, 13 Jul 202202:39 AM IST
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్(Dhavaleshwaram Cotton Barrage) వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Wed, 13 Jul 202212:53 AM IST
కొనసాగుతున్న వరద….
పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 9 గంటలకు 12.5 లక్షల క్యూసెక్కులు చేరింది. స్పిల్ వే వద్ద వరద నీటి మట్టం 34.2 మీటర్లకు చేరింది. స్పిల్ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి.. 12.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్ వే దిగువన దిగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 25.4 మీటర్లకు చేరుకుంది.
Wed, 13 Jul 202212:53 AM IST
గేట్లన్నీ ఎత్తేశారు…
తెలంగాణలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) రాష్ట్రంలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వందేళ్ల చరిత్రలో జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం ఇదే ప్రథమం. బేసిన్‌లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురువడంతో గోదావరితోపాటు కడెంవాగు, ప్రాణహిత తదితర ఉపనదులు ఉప్పొంగుతున్నాయి.
Tue, 12 Jul 202205:13 PM IST
కోనసీమలో వింత.. నేల నుంచి వేడి ఆవిరి
కోనసీమలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు భారీవర్షాలకు నేల మెుత్తం తడుస్తుంటే.. ఓ ఇంటి ఆవరణం మాత్రం వేడెక్కింది. నేల నుంచి వేడి ఆవిరి బయటకు వస్తోంది. ఐ పోలవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని తవ్వి చూడగా.. ఆవిర్లు వస్తూనే ఉన్నాయి.
Tue, 12 Jul 202202:27 PM IST
గోదావరికి భారీగా వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద నదిలోకి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గౌతమి, వశిష్ట, వైనతేయ ఉద్ధృతికి లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే రాకపోకలు జరుగుతున్నాయి.
Tue, 12 Jul 202211:45 AM IST
ధవళేశ్వరం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి నదికి వరద భారీగా వస్తోంది. ధవళేశ్వరం వద్ద నదిలోకి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదతో బ్యారేజీకి దిగువనున్న లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Tue, 12 Jul 202210:18 AM IST
సీఎం జగన్ సమీక్ష
గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని సీఎం జగన్ అన్నారు. గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్థాయిలో వరద రాలేదన్నారు. ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉంటుందని, అయితే తొలిసారిగా జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని సీఎం జగన్ చెప్పారు. రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని తెలిపారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్న జగన్.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని ఆదేశించారు.
Tue, 12 Jul 202207:51 AM IST
నీట మునిగిన కాఫర్ డ్యామ్
పోలవరం నుంచి 14లక్షల క్యూసెక్కుల గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో వరద నీరు ప్రవహిస్తోంది. కొవ్వూరు గోస్పాద క్షేత్రం నీట మునిగింది. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం నీటిప్రవాహం తగ్గిన దిగువున గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు దిగువకు వచ్చి చేరుతోంది.
Tue, 12 Jul 202207:31 AM IST
కోనసీమ జిల్లాలో టెన్షన్
గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో గోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జిల్లాలో వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కోనసీమ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ధవళేశ్వరం నుంచి 12.35లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Tue, 12 Jul 202206:01 AM IST
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Tue, 12 Jul 202205:53 AM IST
మరికాసేపట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో వరద పరిస్థితిపై కాసేపట్లో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నాలుగు రోజులుగా తెరిపిలేని వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి వస్తున్న వరదలపై సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
Tue, 12 Jul 202204:02 AM IST
పోలవరంలో వందేళ్ల రికార్డు స్థాయి వరద...
పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉదయం 9గంటలకు గోదావరి నీటి మట్టం; 34.025మీటర్లకు చేరింది. గతేడాది సీజన్ మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నీటి మట్టం 34.7మీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్ లో జూలైలోనే 100 ఏళ్ళ రికార్డు స్దాయిని గోదావరి వరద అధిగమించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం ప్రాజెక్టు దగ్గరే ఉండి వరద ఉదృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
Tue, 12 Jul 202204:00 AM IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. మత్స్యకారులు వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. విశాఖ, తూ.గో, కోనసీమ, కాకినాడ, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్ష సూచన ఉంటుందని ప్రకటించారు. రేపు కూడా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.
Tue, 12 Jul 202202:48 AM IST
ఏజెన్సీలో రాకపోకలు బంద్
ఏలూరు జిల్లాలో భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. విలీన మండలాల్లో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడులో కల్వర్టులు మునిగి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Tue, 12 Jul 202212:59 AM IST
గోదావరి వరద ఉధృతి, హెల్ప్‌లైన్ ఏర్పాటు
గోదావరిలో వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్దఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 12.10లక్షల క్యూసెక్కులకు చేరింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు పనిచేసే స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో
• 1070
• 18004250101
• 08632377118 నంబర్లలో సహాయాన్ని కోరవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
Tue, 12 Jul 202212:52 AM IST
బలపడనున్న అల్పపీడనం
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మంగళవారం మరింత బలపడనుంది. ఉత్తర కోస్తాలో మంగళవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురియనున్నాయి. ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం బలపడటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్లూరి జిల్లా బోరంగులలో అత్యధికంగా 57.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
Tue, 12 Jul 202212:48 AM IST
రాజమండ్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం నుంచి 10లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 13.75అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద 11.75అడుగులకు నీరు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం వద్ద గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవశేంచింది. గోదావరి దిగువన కోనసీమ ప్రాంతాల్లో కూడా గోదావరి వరద ప్రభావం కనిపిస్తోంది.
Tue, 12 Jul 202212:35 AM IST
ధవళేశ్వరం నుంచి భారీ వరద నీరు విడుదల
గోదావరి ఉగ్రరూపంతో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే మీద నుంచి దిగువకు వెళుతోన్న వరద ప్రవాహం వెనక్కి మళ్లి దిగువ కాఫర్ డ్యామ్‌ను ముంచెత్తాయి. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనుకున్నా అది సాధ్యపడలేదు. 30.5 మీటర్ల ఎత్తున కాఫర్ డ్యామ్ నిర్మిస్తే ప్రాజెక్టు పనులకు ఇబ్బంది ఉండదని అధికారులు భావించారు. అయితే నిర్ణీత లక్ష్యం మేరకు దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి కాకపోవడంతో వరద ప్రవాహం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది.
Tue, 12 Jul 202212:32 AM IST
ఎగువున వర్షాలతో పోటెత్తుతున్న ప్రకాశం బ్యారేజీ
కర్ణాటక, తెలంగాణలలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ నుంచి 41వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. కాలువలకు 5వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. 50గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి ప్రధానంగా మున్నేరు నుంచి 30వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. జిల్లాలో వర్షం తక్కువగానే నమోదైనా, తెలంగాణ జిల్లాల నుంచి కృష్ణా ఉపనదులకు వరద పోటెత్తుతుండటంతో ఆ నీరంతా దిగువకు వస్తోంది. తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
Mon, 11 Jul 202205:23 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఏన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పైనుంచి వస్తున్న వరదలు, భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Mon, 11 Jul 202205:23 PM IST
భారీగా వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గోదావరి నదికి మరింత వరద పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Mon, 11 Jul 202205:23 PM IST
మరో రెండు రోజులు వర్షాలు
రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Mon, 11 Jul 202205:23 PM IST
ధవళేశ్వరం వద్ద 8 అడుగుల నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5 లక్షల 27 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.
Mon, 11 Jul 202207:34 AM IST
పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. వరద కారణంగా పోలవరం స్పిల్‌వే మీదుగా లక్షల క్యూసెక్కుల ప్రవహం సముద్రలోకి వెళుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మంత్రి అంబటి రాంబాబు సమీక్షించారు. వరద ప్రభావంపై అధికారులతో కలిసి పరిశీలించారు.
Mon, 11 Jul 202205:43 AM IST
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల
విజయవాడలో ఎడతెరపి లేకుండా జల్లులు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. మున్నేరు, పాలేరు, బుడమేరుల నుంచి భారీగా వరద నీరు కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువున నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహం మొత్తాన్ని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బ్యారేజీ 45 గేట్లను ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Mon, 11 Jul 202205:36 AM IST
పశ్చిమలో ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం
పశ్చిమ గోదావరిలో వర్షాలతో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకాలువ, తమ్మిలేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పోలవరం వద్ద ప్రమాకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు దాటే సమయంలో నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లో రోడ్లు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. ఎర్రకాలువ పరిధిలో నిడదవోలు, తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.
Mon, 11 Jul 202205:33 AM IST
నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్ల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి దాదాపు 12లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాంతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అటు స్పిల్ ఛానల్ మీదుగా వస్తున్న వరద ప్రవాహం దిగువ కాఫర్ డ్యామ్‌ను దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రధాన డ్యామ్‌కు ఇరువైపులా ఉన్న కాఫర్ డ్యామ్‌లను నిర్మించారు. పోలవరంలో ప్రస్తుతం నీటి మట్టం 30అడుగులకు చేరింది.
Mon, 11 Jul 202205:09 AM IST
భారీ వర్షాలతో రైళ్ల రద్దు….
భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17267/17268 కాకినాడ పోర్ట్-విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ మెమూ ను రద్దు చేశారు. దీంతో పాటు ట్రైన్ 07978/07977 విజయవాడ-బిట్రగుంట-విజయవాడ ప్యాసింజర్ రైలు రద్దైంది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.17258 కా కిపాడ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ పోర్ట్-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా రాజమండ్రి వరకు మాత్రమే నడుపనున్నారు. బుధవారం
Mon, 11 Jul 202203:59 AM IST
తుంగభద్రకు భారీగా వరద నీరు
ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. క్షణమైనా తుంగభద్ర నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుంగభద్ర ఇన్ ఫ్లో 92,160 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 423 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1628 అడుగులకు చేరింది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా ఉంది
Mon, 11 Jul 202203:56 AM IST
ఏజెన్సీలో పాఠశాలలకు సెలవులు
కూనవరంలో గోదావరి నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 85 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఏటపాక మండలాల్లో వరదలు తగ్గే వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.