Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప
Navaratri Brahmotsavams at Tirumala 2023 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం …. శ్రీ మలయప్పస్వామి హనుమంత వాహనంపై కటాక్షించారు.
Navaratri Brahmotsavams at Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులతో పాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.
సరస్వతీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ…
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా ఆరో రోజు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం.
మూలానక్షత్రం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో క్షేమంగా బయటకురావాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గురువారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వాహనాలను కొండపైనే కాకుండా ఆలయ పరిసరాల్లోకి కూడా పోలీసులు అనుమతించట్లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దుర్గగుడికి రానున్నారు. ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.