Polavaram : అందమైన అడవి మధ్యలో అద్బుతం.. మహిమగల ఈ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం!-gubbala mangamma temple is famous in the middle of buttayagudem forest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram : అందమైన అడవి మధ్యలో అద్బుతం.. మహిమగల ఈ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం!

Polavaram : అందమైన అడవి మధ్యలో అద్బుతం.. మహిమగల ఈ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం!

Basani Shiva Kumar HT Telugu
Sep 22, 2024 04:54 PM IST

Polavaram : అది దట్టమైన అడవి. ఆ ఆడవిలో గలగల పారే సెలయేర్లు. ఆ సెలయేర్ల మధ్యలో మహిమ గల అమ్మవారు.. ఆ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు భక్తులు. అవును ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్న గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు.

గుబ్బల మంగమ్మ సన్నిధి
గుబ్బల మంగమ్మ సన్నిధి

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి.. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగాను అందరినీ ఆకర్షిస్తోంది. ఆరాధ్య దైవంగా పూజలందుకుంటుంది. భక్తుల కోర్కెలు తీర్చె తల్లిగా గుబ్బల మంగమ్మకు పేరుంది. దీంతో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇదీ చరిత్ర..

దాదాపు 55 ఏళ్ల కిందట బుట్టాయగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి.. వెదురు గెడలు తెచ్చేందుకు అడవిలోకి వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఎద్దులు అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట. అదేరోజు రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మతల్లి కలలోకి వచ్చింది. వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో తాను వెలిశానని.. తనను దర్శించుకున్నాక వెదురు తీసుకు వెళ్లాలని చెప్పింది. దీంతో కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మతల్లి వెలసిన ప్రదేశాన్ని దర్శించుకొని.. పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మంగమ్మతల్లిని దర్శించుకుంటున్నారు.

వారే పూజారులు..

గుబ్బల మంగమ్మ అమ్మవారికి గిరిజనులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. వారే పూజారులుగాా వ్యవహరిస్తారు. మంగమ్మ తల్లి సన్నిధిలో ఎంతోమంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే ఉత్పత్తులు, రోకళ్లు, వెదురుతో అల్లిన వస్తువులను విక్రయిస్తుంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అమ్మవారు వెలిసిన సమీపంలోనే ఓ గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టును సంతాన వృక్షంగా భక్తులు నమ్ముతారు. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం.. పసుపు, కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలాచేస్తే.. అమ్మవారి అనుగ్రహంతో పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం.

ఇలా వెళ్లాలి..

మంగమ్మతల్లి సన్నిధికి దగ్గర్లో జంగారెడ్డిగూడెం పట్టణం ఉంది. అక్కడి నుంచి బుట్టాయగూడెం, దొరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్లొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం మీదుగా కూడా వెళ్లొచ్చు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అశ్వారావుపేట నుంచి రాచన్నగూడెం, పూచికపాడు మీదుగా వేపులపాడు, పందిరిమామిడిగూడెం మీదుగా దర్శనానికి వెళ్లొచ్చు. అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా అటవీమార్గంలో మంగమ్మతల్లిని దర్శించుకోవచ్చు. ట్రైన్‌లో వస్తే.. ఏలూరు వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంకు బస్సులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా జంగారెడ్డిగూడెం చేరుకొని మంగమ్మ సన్నిధికి చేరుకోవచ్చు.

ఈ ప్రయాణం అద్బుతం..

మంగమ్మతల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు.. అడవి మార్గంలో ప్రయాణం అద్బుత అనుభూతిని కలిగిస్తుంది. కామవరం దాటిన తరవాత కొంత దూరం వేళ్లే సరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరి కొంత దూరం వెళ్లిన తర్వాత గుబ్బల మంగమ్మతల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎతైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. అడవి పచ్చగా మారింది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఎక్కువమంది దర్శించుకుంటారని స్థానికులు చెబుతున్నారు.