Agnipath Scheme :రక్షణ రంగంలో షార్ట్ సర్వీస్‌కు క్యాబినెట్ అమోదం
రక్షణ శాఖ నియామకాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా అగ్నిపథ్ పథకానికి కేంద్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 17-21 ఏళ్ల మధ్య వయసున్న వారిని సైన్యంలో నియమించుకుని నాలుగేళ్ల పాటు సర్వీసులో కొనసాగిస్తారు. ఆ తర్వాత 75శాతం మందికి రిటైర్మెంట్ ఇస్తారు.
భారత రక్షణ దళాల నియామకాల్లో కొత్త పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న అగ్నిపథ్ పథకాన్ని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. తాజా పథకంతో త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కింద నియామకాలు చేపడతారు.
17-21 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని రక్షణ విభాగాల్లో నియమించుకుంటారు. వీరికి నెలకు రూ.30-40వేల వేతనం అందిస్తారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తైన తర్వాత ఎంపికైన వారిలో 25శాతం మందిని రక్షణ శాఖలో కొనసాగిస్తారు. మిగిలిన వారికి వన్‌టైమ్ బెనిఫిట్ అందిస్తారు. ఇలా ఒకేసారి 11 నుంచి 12 లక్షల రుపాయలను రిటైర్ అయ్యే వారికి అందిస్తారు. దీని ద్వారా రక్షణ శాఖపై భారీ ఆర్ధిక భారం తప్పనుంది. తొలి దశలో 45వేల మంది ఈ సర్వీసులో చేర్చుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది. నాలుగేళ్ల తర్వాత వారిలో 75శాతం మందికి రిటైర్మెంట్ ఇస్తారు. చిన్న వయసులో రక్షణ బలగాల నుంచి బయటకు రావడం ద్వారా వారి భవిష్యత్తుకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. యువతను రక్షణ దళాల్లోకి ఆసక్తి చూపించేలా అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రక్షణ దళాల్లోకి ప్రవేశించే వారు నాలుగేళ్ల పాటు సర్వీసుల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఎంపికైన వారికి ఆర్నెల్ల పాటు రక్షణ వ్యవహారాల్లో శిక్షణనిస్తారు. నాలుగేళ్ల తర్వాత సైన్యంలో చక్కటి ప్రతిభ చూపిన వారిని సర్వీసులో కొనసాగిస్తారు.
యువత తమ శక్తి సామర్ధ్యాలను నిరూపించేుకునేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ చెప్పారు. త్రివిధ దళాధిపతుల సమక్షంలో రక్షణ శాఖ మంత్రి అగ్నిపథ్ పథకాన్ని లాంఛనంగా ప్రకటించారు. దాదాపు రెండేళ్ల పాటు కసరత్తు చేసిన తర్వాత పథకానికి క్యాబినెట్ అమోద ముద్ర వేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ పథకం ద్వారా నియమితులైన సైనికుల్ని అగ్నివీర్‌లుగా పరిగణిస్తారు.
ప్రస్తుతం రక్షణ బలగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద జరుగుతున్న నియామకాలకు పదేళ్ల సర్వీసు ఉంటుంది. దానిని గరిష్టంగా 14ఏళ్ల వరకు పొడిగించవచ్చు. తాజా పథకంలో రక్షణ రంగంపై జీతాలు, పెన్షన్ల బారం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం దేశంలో రక్షణ రంగ బడ్జెట్ రూ.5.25లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ.1.19లక్షల కోట్లను సైనికుల పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
టాపిక్