TDP Yanamala: బీసీ జనగణన చేయకుండా ద్రోహం చేస్తున్నారన్న యనమల రామకృష్ణుడు
TDP Yanamala: ఏపీలో బీసీ జనగణన చేయకుండా వైఎస్సార్సీపీ.. బీసీ ప్రజలకు ద్రోహం చేస్తోందని మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపించారు.
TDP Yanamala: సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణనను దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక స్థితి గతులేంటి..? దారిద్య్ర రేఖకు దిగువన ఉండడానికి గల కారణాలు ఏంటి? సంచార జాతులుగా ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితి వంటి సమాచారం బీసీ జనగణన ద్వారానే వస్తోందన్నారు.
ఈ సమాచారం లేకుండా జగన్ ఏ విధంగా పాలన సాగిస్తారని.. రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయవచ్చని పట్నా హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. బీహార్ ప్రభుత్వం కూడా జనగణన మొదలు పెట్టిందని జగన్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీసీ జనగణనను జగన్ పట్టించుకోవడం లేదని, బీసీలంటే ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. బీసీల విషయంలో లెక్క లేనితనం చూపుతున్నజగన్‌కు త్వరలో బీసీలే బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో వెంటనే బీసీ జనగణనను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.
టీడీపీ హయాంలో చట్ట సభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే వాటిని ఆమోదించుకునేందుకు కూడా జగన్ దృష్టిపెట్టకపోవడం దుర్మార్గమన్నారు. అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీల సంక్షేమంపై లేదని యనమల విమర్శించారు.
మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో 140 మంది అవినీతి తిమింగళాలే అనే విషయం ఏడీఆర్ నివేదిక ద్వారా బట్టబయలైందరి ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారని, దేశంలో అత్యధిక ధనిక ఎమ్మెల్యేల జాబితా చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలే మొదటి స్థానంలో ఉన్నారన్నారు.
అయినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని, నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలతో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లపై దృష్టిపెట్టిన విధంగానే వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా కాపాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీదే అనే విషయం నిన్న చంద్రబాబు నాయుడుగారి బహిరంగసభ ద్వారా స్పష్టం అయ్యిందన్నారు. జగన్ సొంత నియోజక వర్గం, సొంత ఊరిలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జగన్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపడుతోందన్నారు.
జగన్ సభలకు బలవంతంగా ప్రజలను తరలించిన రావట్లేదని చంద్రబాబు నాయుడు సభలకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరై మద్దతు తెలుపుతున్నారన్నారు. పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజా సంపదను పెత్తందారులకు దోచిపెట్టడం ద్వారే జగన్ సభలకు జనం కరువయ్యారని విమర్శించారు.