Jagan Political Review: ప్రోగ్రెస్ రిపోర్ట్‌లపై ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..
Jagan Political Review: ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు మదింపుపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలి పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. స్కూల్లో పిల్లల మాదిరి ఎమ్మెల్యేలను నిలబెట్టి ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వడం, వాటిపై మీడియాకు లీకులివ్వడంపై రగిలిపోతున్నారు.
Jagan Political Review: ముఖ్యమంత్రితో సమీక్ష అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. స్కూల్ పిల్లల మాదిరి ఎప్పుడు ఎవరిని నిలబెట్టి క్లాసు పీకుతారోనని కలవరపడిపోతున్నారు. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది.నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు ఉన్న పట్టు, గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు మదింపు చేపడుతున్న వైఎస్సార్సీపీ అవసరమైతే వేటుకు కూడా సిద్ధమేననే సంకేతాలు చాలా రోజులుగా ఇస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న సమీక్షపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.
ఏపీలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అభ్యర్థుల పేరు ప్రతిష్టలతో సంబంధం లేకుండా జగన్ సృష్టించిన సునామీలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో 151 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైన తర్వాత ఎమ్మెల్యేలు వెనుదిరిగి చూసుకుంటే, చాలా మందికి చెప్పుకోడానికి ఏమి కనిపించడం లేదు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరిని ముఖ్యమంత్రి నియంత్రణలో ఉంచుకున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఈ తరహా రాజకీయాలు సాధారణమే అయినా అంతకు మించిన ఆంక్షలు, వ్యూహాలను వైసీపీ అధినేత అమలు చేశారు. ప్రజా ప్రతినిధుల అవినీతిని ఊపేక్షించేది లేదని మొదట్లోనే స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు అప్పగించినా వాటిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఉన్నత స్థాయిలో అమోదం ఉంటే తప్ప అమలు చేయలేని పరిస్థితి కల్పించారు.
కేంద్రీకృత వ్యూహాలు బెడిసికొడతాయా...?
ఏపీలో అధికార పార్టీకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజా ప్రతినిధుల గెలుపు బాధ్యతలు తమవేనని ముఖ్యమంత్రి మొదట్నుంచి అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మొదట్లోనే అందరిని హెచ్చరించారు. పదవిలో ఉండగా సంపాదించుకోవాలనే ఆలోచనలు వదులుకోవాలని స్పష్టం చేశారు. ఇది ఎమ్మెల్యేలకు రుచించకపోయినా చేసేదేమి లేక కాలం నెట్టుకొచ్చారు. వాటి ఫలితాలు ఇప్పుడు అర్థమవ్వడంతో ఎమ్మెల్యేలు కలత చెందుతున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారాలను ప్రభుత్వ పరం చేశారు. దీంతో నియోజక వర్గాల్లో చాలామంది ద్వితియ స్థాయి నాయకులకు వ్యాపారాలు లేకుండా పోయాయి. ఇసుకను కూడా స్థానిక నాయకత్వానికి అందుబాటులో లేకుండా చేశారు. ప్రభుత్వం నియమించిన సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి. చాలా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం ఖర్చు పెట్టిన నాయకులకు ప్రధానమైన వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో తీవ్రంగా నష్టపోయారు. వారంతా కక్కలేక మింగలేక రగలి పోతున్నారు. ఆదాయ మార్గాలు లేని ప్రజా ప్రతినిధులు విధిలేని పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు
2024 ఎన్నికల్లో గెలుపు బాధ్యత తనదేనని మొదట్నుంచి ఎమ్మెల్యేలకు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత ఏడాది పనితీరు బాగుంటూనే మళ్లీ టిక్కెట్లని మెలిక పెట్టారు. ఇప్పుడు మళ్లీ తమకు టిక్కెట్ దక్కుతుందో లేదోననే ఆందోళన కూడా చాలామందిలో లేకపోలేదు. దీనికి తోడు ప్రతి నియోజకవర్గంలో ఐ ప్యాక్ సిబ్బందిని నియమించి వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి పార్టీలో లేకపోవడంతో, మళ్లీ టిక్కెట్ దక్కడంపై సందేహాలు ఉన్న వారు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
పది మందిలో ప్రోగ్రెస్ రిపోర్ట్....
ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష కార్యక్రమంలో స్కూల్లో పిల్లల మాదిరి ఎమ్మెల్యేలను నిలబెట్టి ఐప్యాక్ ఉద్యోగులతో వారి పనితీరు నివేదికలను చెప్పిస్తుండటం కొందరికి రుచించడం లేదు. నిండా పాతికేళ్లు కూడా ఉండని ఐ ప్యాక్ సిబ్బంది మంత్రులు, సహచరులు, నియోజక వర్గ కన్వీనర్ల సమక్షంలో పనితీరుపై వివరాలను వెల్లడించడం వారికి నచ్చడం లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, రెండు మూడుసార్లు కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఐ ప్యాక్ ఉద్యోగులు ఇచ్చే నివేదికలపై చేతులు కట్టుకుని వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చకపోయినా చేసేదేమి లేదనే భావన వారిలో కనిపిస్తోంది. తమ పరిస్థితి బొమ్మరిల్లు చిత్రానికి భిన్నమేమి కాదని ఓ ఎమ్మెల్యే